బక్రీద్ నేపథ్యంలో జంట నగరాల్లో ఒంటె మాంసం విక్రయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఒంటెల రవాణా, వధపై నిషేధం అమల్లో ఉన్న దృష్ట్యా.. పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, పోలీసు, పశు సంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎల్.బి.నగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, జియాగూడ, చార్మినార్, అంబర్‌పేట, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ తదితర పశుసంవర్ధక శాఖ సర్కిళ్ల పరిధిలో ఈ తనిఖీలు సాగుతున్నాయి.
బక్రీద్ పండగ వచ్చిందంటే చాలు.. భాగ్యనగరంలో పెద్ద ఎత్తున ఒంటె మాంసం విక్రయాలు సాగుతాయి. ప్రతి ఏటా రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో ఒంటెలను అక్రమంగా దిగుమతి చేసుకుని.. కొందరు వ్యాపారులు స్థానికంగా విక్రయించడం పరిపాటి. ఇప్పటికే కొన్ని చోట్ల ఒంటెలను వధించి.. మాంసం విక్రయిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ, పోలీసు, పశుసంవర్ధక శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒంటెల రవాణా, వధపై నిషేధం అమల్లో ఉందని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే.. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.