Rahul Gandhi Vijayabheri Yatra in Telangana : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఎన్నికల రణక్షేత్రంలో కాంగ్రెస్ దూకుడుగా సాగుతోంది. పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి అగ్రనేత రాహుల్‌గాంధీ బస్సుయాత్రగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తొలివిడతగా మూడ్రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో పర్యటించిన రాహుల్.. రెండో విడతలో భాగంగా తొలిరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రచారం సాగించారు. మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌లో బహిరంగసభ అనంతరం, శంషాబాద్ నోవాటెల్‌లో బసచేసిన రాహుల్.. నిన్న మధ్యాహ్నం కల్వకుర్తిలో జరిగిన విజయభేరీ సభకు హాజరయ్యారు.
'బీజేపీ బీఆర్ఎస్లకు బీసీలకు అధికారం ఇవ్వడం నచ్చదు అందుకే కుల గణనకు రెండు పార్టీలు ఒప్పుకోవడం లేదు'
కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ, బీఆర్ఎస్, ఎమ్ఎమ్ఐ సంబంధాలపై విమర్శలు గుప్పిస్తూ రాహుల్‌గాంధీ ప్రసంగించారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీరు అందుతుంటే.. లక్షన్నర కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు అప్పుడే బీటలు వారుతున్నాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. కేసీఆర్‌ను ఓడించి.. దోపిడీ చేసిన సొమ్మును రాబడతాన్నారు.
''లక్షన్నర కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు బీటలు వారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దోచుకున్న సొమ్మును రాబడతాం. తెలంగాణలో 2 శాతమైనా ఓట్లు లేని బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనటం విడ్డూరంగా ఉంది. మోదీ అప్పట్లో అందరి ఖాతాల్లో రూ.10లక్షల రూపాయలు పడతాయని అబద్దం చెప్పి అధికారంలోకి వచ్చారు.'' రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Rahul Gandhi Election campaign in Telangana : కల్వకుర్తి నుంచి జడ్చర్లకు చేరుకున్న రాహుల్‌గాంధీ.. అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. 50శాతానికి పైగా ఉన్న ఓబీసీలకు బీఆర్ఎస్, బీజేపీలు వ్యతిరేకమన్న రాహుల్..రాష్ట్రంలో 2శాతం ఓట్లు బీజేపీ.. బీసీని సీఎం చేస్తామనటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఓబీసీల జనగణన చేపడుతామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. జడ్చర్ల కార్నర్ మీటింగ్ అనంతరం షాద్ నగర్ వచ్చిన రాహుల్.. రైల్వే స్టేషన్ నుంచి షాద్‌నగర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేసిన రాహుల్.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కల్వకుర్తిలో జరిగే విజయభేరీ సభకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ఆగిన రాహుల్‌గాంధీ.. నాగర్ కర్నూల్ జిల్లా జిల్లెల గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.
Telangana Assembly elections 2023 : అప్పుల బాధతో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు ఎదురుశెట్టి చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్... వారి పరిస్థితిని చూసి చలించారు. రైతు భార్య తిరుపతవ్వ, కుమారునితో మాట్లాడారు. అసంపూర్తిగా ఉన్న వారింటిని చూసి, పూర్తి చేయించాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.అరగంటపాటు చంద్రయ్య భార్యాబిడ్డతో ముచ్చటించి, వారితో కలిసి జొన్నరొట్టె తిన్నారు. అనంతరం, వారి పంట పొలాన్ని పరిశీలించి, బోర్లలో నీరు లేకపోవటానికి కారణాలను ఆరా తీశారు. భూగర్భజల నిపుణులతో సర్వే చేయించి బోరు వేయిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఆర్ధిక కష్టాలతో చదువు మానేసిన చంద్రయ్య కుమారుడికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. చంద్రయ్య కుటుంబాన్నే కాకుండా... పేదలందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్‌గాంధీ తెలిపారు.