Rachakonda CP Praises woman constable in LB Nagar : రాచకొండ కమిషనరేట్ బాస్ డీఎస్ చౌహాన్. ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీలు కలకలం రేపుతుండటంతో హైదరాబాద్‌లో పదో తరగతి పరీక్ష జరుగుతున్న కేంద్రాలను స్వయంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్బీ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు సీపీ చౌహాన్ కారు ఆగింది. అప్పటికే విధుల్లో భాగంగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు సీపీని చూడగానే ఆందోళనకు గురై, దగ్గరకు వెళ్లి, సెల్యూట్ చేశారు.
Rachakonda CP Praises LB Nagar constable : హడావుడిగా వచ్చిన సీపీ చౌహాన్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు లోపలికి వెళ్లబోయారు. అక్కడున్న ఓ మహిళా కానిస్టేబుల్ అకస్మాత్తుగా సీపీని అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఆమె చేసిన పనికి అక్కడున్న పోలీసు అధికారులంతా షాక్. ఏమైందోనని అందరూ ఆలోచిస్తున్న సమయంలో.. ఆ కానిస్టేబుల్.. "సర్.. మీరు ఫోన్‌తో వెళ్తున్నారు.. ఎగ్జాం సెంటర్‌లోకి ఫోన్ అనుమతి లేదంటూ" సీపీకి చెప్పడంతో చౌహాన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం ఆమెకు మొబైల్ ఇచ్చి లోపలికి వెళ్లారు.
అంకితభావంతో విధులు నిర్వహించాలి: పరీక్షా హాలును తనిఖీ చేసిన అనంతరం బయటకు వచ్చిన సీపీ చౌహాన్.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కల్పన ధైర్యసాహసాలు, విధి నిర్వహణ తీరును ప్రశంసించారు. ఆమెను అభినందిస్తూ.. తన జేబులో నుంచి ఐదు వందల రూపాయల నోటును తీసి.. కల్పనకు బహుమతిగా అందజేశారు. ఆమెను రివార్డ్‌కు ఎంపిక చేయాలంటూ అక్కడున్న పోలీసులకు సూచించారు.
SSC Exams in Telangana : పోలీసులంతా తనను స్ఫూర్తిగా తీసుకుని, విధులు నిర్వహించాలని చెబుతూ చౌహాన్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల జీవితంలో ఎంతో కీలకమైన పదో తరగతి పరీక్షల వేళ అన్నిచోట్ల కల్పనలా అంకితభావంతో విధులు నిర్వహించే ఉద్యోగులు ఉంటే ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చే పరిస్థితి ఉండేది కాదని అన్నారు.
ఖమ్మంలో కట్టుదిట్టమైన బందోబస్తు: వరుసగా పదో తరగతి పేపర్ లీకైన నేపథ్యంలో మూడో పరీక్ష నిర్వహణకు అధికారులు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఆంగ్ల పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను తనిఖీ చేశారు. విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రంలో పనిచేసే అన్ని శాఖల సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించారు. సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలు ఇతర సామాగ్రి లోపలికి అనుమతించలేదు.
పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా, ఏనుకూరు, కారేపల్లి, కొనిజర్ల కేంద్రాల్లో పోలీస్ రెవెన్యూ విద్యాశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అధికారుల హడావుడితో విద్యార్థుల్లో కొంత ఆందోళన ఏర్పడినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: