Rachakonda Commissionerate Special Story : హైదరాబాద్ మహా నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్లలో రాచకొండ కమిషనరేట్ అత్యంత కీలకమైంది. నగరంలోకి నేరగాళ్లు ప్రవేశించినా, స్మగ్లర్లు రాష్ట్రం దాటుతున్నా, దోపిడీ దొంగలను నిలువరించాలన్నా ఈ కమిషనరేట్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలు బయల్దేరిన వెంటనే ఇక్కడి పోలీసులకు సమాచారం అందుతుందంటే కమిషనరేట్ ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పలు సమస్యలు నేరాల కట్టడికి అడ్డంకిగా మారుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఎక్కువగా ఉండటం, జాతీయ రహదారులు ఈ ప్రాంతం నుంచి వెళ్తుండటం, ఓఆర్ఆర్ సైతం కమిషనరేట్ పరిధిలో ఉండటంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు శివారు ప్రాంతాలు కావడంతో దోపిడీలు చేసిన నేరగాళ్లకు పారిపోయేందుకు అనువుగా మారింది. గతంలో జరిగిన నేరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి - మహిళలపై నేరాలు తగ్గాయి : రాచకొండ సీపీ
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా చేసే వారు హైదరాబాద్‌లోకి ప్రవేశించాలంటే రాచకొండ కమిషనరేట్ మీదుగానే రావాల్సి ఉంటుంది. శివారు ప్రాంతాల నుంచే ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ జరుగుతుంది. దీంతో నిత్యం టన్నుల కొద్దీ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. అలాగే జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండటంతో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడం పోలీసులకు సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా హయత్‌నగర్, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్డు, ఉప్పల్ కూడలి వద్ద ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది.
Rachakonda Commissionerate Annual Crime Report 2023 : 2022తో పోలిస్తే గతేడాది కమిషనరేట్‌లో నేరాలు 6.86 శాతం పెరగగా, సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయి. 2023లో రాచకొండ కమిషనరేట్‌లో 16,594 కేసులు నమోదైనట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కమిషనరేట్‌లో మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో మహిళలపై నేరాలు 2022తో పోల్చితే 2023లో 6.65 శాతం తగ్గాయి. 2022లో మహిళలపై నేరాల కేసులు 3,330 నమోదవ్వగా, 2023లో 3122 కేసులు నమోదయ్యాయి. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 200 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు.
Rachakonda Commissionerate Cyber crimes : సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ యోధ అనే కార్యక్రమం ద్వారా వాలంటీర్లతో అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఏటా సైబర్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. కమిషనరేట్ పరిధిలో 2022లో సైబర్ కేసులు 2049 నమోదు కాగా, 2023లో ఆ సంఖ్య 2562కు చేరింది. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంక్ ఖాతాలో రూ.89.92 లక్షల నగదును ఫ్రీజ్ చేసి పోలీసులు బాధితులకు అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు సాంకేతికత ఉపయోగించిన పోలీసులు ఇతర రాష్ట్రాలు వెళ్లి మరీ పట్టుకొస్తున్నారు. దేశంలోని సైబర్ నేరగాళ్లతో పాటు విదేశీ నిందితులను సైతం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీటితో పాటు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. 2022లో 3321 ప్రమాదాలు జరగ్గా, 633 మంది మృతి చెందారు. 3,205 మందికి గాయాలయ్యాయి. కాగా 2023లో రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య 16 శాతం పెరిగింది.
Rachakonda Cp Drugs Seized in Hyderabad : మాదక ద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు రాచకొండ పోలీసులు. 282 మత్తు పదార్థాల కేసుల్లో రాచకొండ పోలీసులు గతేడాది 698 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో విదేశీయులు, అంతర్రాష్ట్ర నేరస్తులూ ఉన్నారు. 12 మందిపై పీడీ చట్టం ప్రయోగించారు. 5,882 కిలోల గంజాయి, 6.55 లీటర్ల హాష్ ఆయిల్, 377 గ్రాముల హెరాయిన్ సహా ఇతర మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన 188 కేసుల్లో 972 మందిని అరెస్టు చేశారు. రూ.1.90 కోట్ల నగదు సీజ్ చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని నేరాల్లో రూ.21.66 కోట్ల విలువ చేసే చోరీలు జరిగితే అందులో రూ.12.77 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం గతేడాది కంటే 2 శాతం ఎక్కువగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Rachakonda Commissionerate : కమిషనరేట్ పరిధిలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో బాల్య వివాహాలు ఎక్కువ నమోదవుతున్నాయి. కాగా చైల్డ్ వెల్ఫేర్ అధికారుతో కలిసి రాచకొండ పోలీసులు గతేడాది 21 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 16,594 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 271 మందికి జైలు శిక్ష పడింది. న్యాయస్థానం వీరికి రూ.3.89 కోట్ల జరిమానా విధించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఏడాది 8,758 ఫిర్యాదులు అందగా, వాటిలో 4,643 ఫిర్యాదులను రాచకొండ పోలీసులు పరిష్కరించారు.
Special focus on Rachakonda police commissionerate : ఎన్నో ప్రత్యేకతలతో దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తున్న రాచకొండ కమిషనర్‌గా ఇటీవల సుధీర్ బాబు బాధ్యతలు తీసుకున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిషనరేట్ డ్రగ్ ఫ్రీ, నేర రహితంగా ఉంచేందుకు కమిషనర్ సుధీర్ బాబు కృషి చేస్తున్నారు. ల్యాండ్ గ్రాబర్లు, రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని అంటున్నారు కమిషనర్ సుధీర్ బాబు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం ధ్వేయంగా నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడేందుకు కృషి చేస్తామని ఆయన అంటున్నారు. సీపీ హామీతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సహా ఇతర సమస్యలు త్వరలోనే తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక: 19 శాతం పెరిగిన నేరాలు