టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయకుండా కళాశాలలు, విశ్వ విద్యాలయాలను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ధ్వజమెత్తారు. యువత నైపుణ్యాలను నిర్వీర్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ వద్ద వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షస్థలికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగుల ఆశల ఆవిరై పోయాయన్నారు కృష్ణయ్య. ప్రభుత్వ శాఖల్లో లక్షా 91వేల ఖాళీలున్నట్లు తెలిపిన పీఆర్సీ నివేదికను ఆయన గుర్తు చేశారు. మేధావులతో కళకళలాడాల్సిన ఉస్మానియా యూనివర్శిటీ.. క్రిమికీటకాలు చేరి వెలవెలబోతోందన్నారు. ప్రజా సమస్యలను రాజకీయ పార్టీలు మరిచాయని విమర్శించారు.
వైఎస్ హయాంలో సమస్యలపై మెమోరాండం ఇస్తే వాటి పరిష్కారానికి కృషి చేసేవారని కృష్ణయ్య కొనియాడారు. కేసీఆర్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో.. ఐఏఎస్ అధికారులంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాలన మొత్తం అస్తవ్యస్థం అయిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: జానారెడ్డి గెలుపును సోనియాకు కానుకగా ఇవ్వాలి: రేవంత్