కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో జాతీయ స్థాయి ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన హైదరాబాద్ నారాయణ గూడలో ప్రకటించారు. త్వరలో వేలాది మందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని... రాజ్యాధికారం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
మనది పేరుకే ప్రజాస్వామ్య దేశమని... ఆచరణలో ధనస్వామ్యంగా మారిపోయిందని ఆరోపించారు.74 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో 56 శాతమున్న బీసీ జనాభాకు... చట్టసభల్లో కేవలం 14 శాతం ప్రాతినిధ్యం దాటలేదన్నారు. 16 రాష్ట్రాల నుంచి ఒక్క పార్లమెంట్ సభ్యుడూ లేరని... దీన్ని ప్రజాస్వామ్యమంటామా అని ప్రశ్నించారు. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది మాత్రమే బీసీలు ఉన్నారని... 175 సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 38 మంది మాత్రమే బీసీలున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: నిరాడంబరంగానే భద్రాద్రి రామయ్య కల్యాణం: ఇంద్రకరణ్