రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దిల్లీ మర్కజ్లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న సమయంలో హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి పరదా గెట్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రాంతం నుంచి మస్తాన్ ఉస్మాన్ అలీ, మునసర్ జబ్రీ, అక్రమ్, నజిమ్, షాబాజ్, ఎస్.కె సౌద్లు మార్చ్ 12న విమానంలో హస్తినకు వెళ్లారు. తిరిగి 18న నగరానికి వచ్చారు. అయితే నాలుగు రోజుల క్రితం ఈ ఆరుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా... శనివారం మధ్యాహ్నం మస్తాన్ ఉస్మాన్ అలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది. మిగిలిన ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉంది.
అయితే పాజిటివ్ వచ్చిన మస్తాన్ ఉస్మాన్ అలీది ఉమ్మడి కుటుంబం. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకే ఇంట్లో 46 మంది నివాసం ఉంటున్నారు. ఇతనికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఈ 46 మంది కుటుంబ సభ్యులను గాంధీ వైద్యురాలు దీప్తి ప్రియాంక.. ఇంట్లోనే టెస్టులు నిర్వహించారు. మిగిలిన ఐదుగురి ఇళ్లల్లో కూడా ఒక్కొక్కరి ఇంట్లో 20 మందికి పైగా నివసిస్తున్నారు. ఈ 46 మంది నమునాలను సేకరించాక.. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ ముద్ర వేసి ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించినట్లు జీహెచ్ఎంసి అసిస్టెంట్ మెడికల్ వైద్యాధికారి హేమలత తెలిపారు.
ఇదీ చూడండి: మాస్కు ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?