క్యూఆర్ కోడ్(QR Code)తో కూడిన పుస్తకాలను తెలుగు అకాడమీ ముద్రిస్తోంది. ఇంటర్(INTER) ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోని గణితం, భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల సబ్జెక్టుల్లోనే అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తోంది. ఆ కళాశాలల్లోని సైన్స్ గ్రూపుల విద్యార్థులకు క్యూఆర్ కోడ్ పుస్తకాలు అందుతాయి. దీనివల్ల దాదాపు లక్ష మంది ప్రయోజనం పొందుతారు. మరో వారం పది రోజుల్లో పుస్తకాలను తెలుగు అకాడమీ ముద్రించనుంది. ఇంటర్ విద్యాశాఖ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల వివరాలు అందిన తర్వాత కళాశాలలకు సరఫరా చేయనున్నారు.
ఒక్కో సబ్జెక్టుకు 80-90 వీడియో పాఠాలు
పాఠశాల తరగతుల పుస్తకాల కోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన క్యూఆర్ కోడ్‌లను స్మార్ట్ ఫోన్ (Smart Phone) ద్వారా స్కాన్ చేస్తే పుస్తకంలోని అదనపు సమాచారం కనిపిస్తుంది. ఇంటర్ పుస్తకాల్లో మాత్రం సమాచారం కాకుండా వీడియోలు వస్తాయి. వాటిని మన టీవీ కోసం టీశాట్ తయారు చేసింది. ఒక్కో సబ్జెక్టుకు 80-90 వీడియో పాఠాలు ఉంటాయి.
ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్