నేటితరం యువతకు పీవీ సింధు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రెండు ఒలింపిక్స్ (Olympics) క్రీడల్లో పతకాలు నెగ్గి.. వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని కొనియాడారు.
టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం సాధించిన పీవీ సింధు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్‌తో కాసేపు ముచ్చటించారు. ఒలింపిక్స్ అనుభవాలను తమిళిసైతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మరిన్ని విజయాలు సాధించి.. సింధు దేశానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకు రావాలని గవర్నర్ ఆకాంక్షించారు.
వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం..
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగుతేజం పి.వి.సింధు అన్నారు. తల్లిదండ్రులు, ప్రభుత్వం, కోచ్ సహకారం వల్లే పతకం సాధించ గలిగానని తెలిపింది. సెమీస్‌లో ఓటమి చవిచూసినప్పటికీ నా ఆట మిగిలే ఉందనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడంతోనే కాంస్యం వరించిందని తెలిపారు. వరుసగా రెండు పతకాలు సాధించిన తాను.. వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యమని తెలిపారు.
రూ.30 లక్షల నగదు బహుమతి..
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు.. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సచివాలయానికి వచ్చిన సింధును.. ఆ రాష్ట్ర సీఎం జగన్, మంత్రులు అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రూ.30 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ఆమెకు అందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
సంతోషదాయకం..
క్రీడాకారుల ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమని సింధు చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పతకాల సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. విశాఖలో తన అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని.. త్వరలోనే ఏర్పాట్లు పూర్తి చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని సింధు చెప్పారు.
సంబంధిత కథనాలు..