Bank Employees Strike in Telangana: జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్తంగా రెండు రోజులు సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను బ్యాంకు ఉద్యోగులు వ్యతిరేకించారు. ఈ దేశవ్యాప్తంగా ఉద్యోగులు తలపెట్టిన సమ్మె రెండో రోజు హైదరాబాద్లో కొనసాగుతోంది. రెండు రోజుల సమ్మెతో రాష్ట్రమంతా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. బ్యాంకింగ్ చట్ట సవరణ ఆపాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ... కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో విధులు బహిష్కరించి… ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.
మరో సంక్షోభం వస్తాది..
బ్యాంకింగ్ చట్ట సవరణ ఆపాలని బ్యాంకర్ల సంఘాలు డిమాండ్ చేశాయి. బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ చట్ట సవరణ ఆపాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తే 2008లో ఏవిధంగా అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందో... అదే తరహాలో మరో సంక్షోభం వస్తుందని హెచ్చరించారు. కేంద్రం తక్షణమే ఈ చట్ట సవరణ ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నిలిచిన లావాదేవీలు..
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఏడు లక్షల మంది సిబ్బంది సమ్మెకు దిగడంతో దేశంలో పలుచోట్ల బ్యాంకు సేవలకు అంతరాయం వాటిల్లింది. ఏటీఎంలు పనిచేయడం వల్ల కొన్ని సేవలు లభ్యమైనా, నేరుగా బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన పనులు స్తంభించిపోయాయి. రూ.18,600 కోట్ల విలువైన 20.4 లక్షల చెక్కుల లావాదేవీలు నిలిచిపోయాయని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం తెలిపారు.
ఇదీ చూడండి: Bank employees strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో నిలిచిన రూ.18,600 కోట్ల చెక్కుల లావాదేవీలు