Chandrababu Arrest Rallys in Telangana : తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్(Chandrababu Arrest)ను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జగన్ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
TDP Protests in Telangana : సంగారెడ్డిలో చంద్రబాబు మద్ధతుదారులు, పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. నల్ల టీషర్టులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ సర్కార్ తీరును నిరసిస్తూ.. ఐటీఐ కాలేజ్ నుంచి పాత బస్టాండ్ మీదుగా హనుమాన్ దేవాలయం వరకు.. ద్విచక్రవాహనాలతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం, పార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రబాబు ఆరోగ్యంగా బయటికి రావాలని ప్రార్థించారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై ఎన్ని కక్షసాధింపు చర్యలకు పాల్పడినా.. ప్రజల్లో ఆయన ఆదరణ తగ్గదన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. పాలకులు అభివృద్ధిలో పోటీపడాలి గాని.. ఇలాంటి అప్రజాస్వామికంగా అక్రమ అరెస్టులు చేయడం తగదన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేర్చుకోవాలన్నారు. నల్గొండ జిల్లా నిడమానూరులో చంద్రబాబు అరెస్ట్‌పై అఖిలపక్ష నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు.
TDP Rally in Khammam : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రదర్శన దీక్ష చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలంతా ఖండించాలి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అఖిలపక్షాల నాయకులు కార్యకర్తలు ప్రజలు దీక్షలో పాల్గొన్నారు. దీక్ష కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య పాల్గొని మద్దతు తెలిపారు.
వరంగల్ జిల్లాలో టీడీపీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. తమ అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మహిళలు పెద్ద ఎత్తున బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Chandrababu Supporters Homam in Kukatpally : హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాదులు వేసిన మహానేత చంద్రబాబుపై రాజకీయకక్ష సాధింపుతోనే జగన్మోహన్‌రెడ్డి అరెస్టు చేయించారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. ఆయన క్షేమంగా తిరిగి రావాలని పలుచోట్ల అభిమానులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో గల వెంకటేశ్వరస్వామి ఆలయంలో వల్లేవల్లి దుర్గాప్రసాద్-శారదా దంపతులు సుదర్శన హోమాన్ని నిర్వహించారు.