Promotions Telangana Excise Department : రాష్ట్రంలోని పలు శాఖల్లో పదోన్నతులకు జాప్యం జరుగుతోంది. పదోన్నతుల కోసం మూడువేల మందికి పైగా అధికారులు, పదివేల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నిబంధనల మేరకు ఏటా సెప్టెంబరు మొదటి తేదీ నుంచి తదుపరి ఏడాది ఆగస్టు 31 వరకు డీపీసీ సమావేశాలు జరుగుతాయి. ఒక పోస్టుకు ఇద్దరు చొప్పున రూపొందించే జాబితాను ప్రభుత్వం పరిశీలించి పదోన్నతులకు ఎంపిక చేస్తుంది.
ఆ తర్వాత ఏడాదిలోగా వారిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించాలి. నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు డీపీసీలతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం శాఖాపరమైన అవసరాల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున ప్రమోషన్లు ఇచ్చింది. ఎక్కువ మందికి ప్రయోజనం దక్కేందుకు ఉద్యోగుల కనీస సర్వీసు పరిమితిని రెండేళ్లకు తగ్గించింది. ఆ తర్వాత పదోన్నతులు పెరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 2020, 2021లలో జనవరి నుంచి మార్చి వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టగా... 40 వేల మందికి పదోన్నతులు లభించాయి. 2021 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచడంతో ఈ ప్రక్రియలో కొంత మేర ప్రతిష్టంభన ఏర్పడింది.
ఖాళీలుంటేనే..: పదవీ విరమణ వయసు పెంపు కారణంగా 2021 ఏప్రిల్ తర్వాత ఖాళీల సంఖ్య తగ్గింది. రాజీనామాలు, మరణాలు, స్వచ్ఛంద ఉద్యోగ విరమణలతో ఖాళీ అయిన పోస్టులను పదోన్నతులతో భర్తీ చేస్తున్నారు. గతంలో ఒక్కో డీపీసీ జాబితాలో 50 నుంచి వంద వరకు జాబితాలు ఉండగా.. 2021 తర్వాత అది అయిదు లేదా పది పోస్టులకే పరిమితమవుతోంది. స్పష్టమైన ఖాళీల ప్రాతిపదికన మాత్రమే డీపీసీలు నిర్వహించడం వల్ల అర్హులందరికీ అవకాశం రావట్లేదు. కొన్నిచోట్ల సీనియారిటీపరమైన అంశాలపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలుండడంతో జాప్యమవుతోంది. కొన్ని శాఖల్లో పదోన్నతుల ద్వారా భర్తీ కావాల్సిన పోస్టులను తాజాగా చేపట్టిన నియామకాల్లో చేర్చడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
హోదా పెరగకుండానే..:
- రిజిస్ట్రేషన్ల శాఖలో ఇద్దరు అధికారులకు డీఐజీలుగా పదోన్నతి ఇచ్చేందుకు తొమ్మిది నెలల కిందట డీపీసీ ఆమోదం తెలిపింది. వారికి ఇటీవల పదోన్నతుల ఉత్తర్వులిచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్న జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల్లోనే కొనసాగించడం వల్ల వారి హోదా పెరగలేదు. కిందిస్థాయి వారికి పదోన్నతులు రావడం లేదు.
- వ్యవసాయ శాఖలో ఏవో, ఉప, సంయుక్త సంచాలకులు, ఉద్యానవన శాఖలో సహాయ, ఉప సంచాలకుల పదోన్నతులకు సంబంధించి డీపీసీల నిర్వహణ ఆలస్యమవుతోంది.
- 2015 నుంచి విద్యాశాఖలో ఉపాధ్యాయులకు పదోన్నతులివ్వడం లేదు. వివాదాలు, న్యాయపరమైన అంశాలను కారణంగా చెబుతున్నారు.
- సహకారశాఖలో 18 సంవత్సరాలుగా సహాయ రిజిస్ట్రార్ల కేడర్ వారికి ప్రమోషన్లు లేవు.
- వ్యవసాయశాఖలో విస్తరణాధికారులు (ఏఈవో), వైద్యఆరోగ్య శాఖలో నేత్ర (ఆఫ్తాల్మాలిక్) అధికారులు, పశుసంవర్ధకశాఖలో సహాయకులదీ ఇదే స్థితి.
ప్రత్యేక కార్యక్రమంపై ఆశలు: నీటిపారుదల, వైద్య ఆరోగ్య, పోలీసు, పంచాయతీరాజ్, పురపాలక వంటి శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ నిరంతరం సాగుతోంది. మిగిలిన శాఖలకూ అలాంటి అవకాశం కల్పించాలని అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. 2020, 21 సంవత్సరాల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం తరహాలో పదోన్నతుల ప్రక్రియ సాగాలని వారు ఆశిస్తున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం: సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఆదేశాలు జారీ చేయడం వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా పదోన్నతులు దక్కాయి. అదే తరహాలో అన్ని శాఖల్లో వేగవంతంగా ఈ ప్రక్రియను నిరంతరం సాగించాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమస్యలుంటే వెంటనే పరిష్కరించి, అర్హులైనవారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. సీఎం ఆదేశాల అమలుకు అధికారులు చొరవ చూపాలి.
ఇవీ చదవండి: