లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కేంద్రం.. ఉద్యోగుల పొట్ట కొడుతోందని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆచార్య నాగేశ్వర్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నా అడిగే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గన్‌ఫౌండ్రిలోని నీలం రాజశేఖర్‌రెడ్డి పరిశోధనా కేంద్రంలో పబ్లిక్ సెక్టార్- ప్రైవేట్ సెషన్ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
వివిధ వర్గాల సమస్యల పరిష్కారం కోసం మండలిలో ప్రజల తరఫున మరోసారి బలమైన వాణి వినిపించేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని నాగేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 39 శాతం ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని... ఉద్యోగ ప్రకటనలపై కేంద్రం నిషేధం విధించిందని ఆరోపించారు. ఐటీఐఆర్, కాజీపేట రైల్వేకోచ్ ప్రాజెక్టులను రద్దు చేసి తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా తన పదవీ కాలంలో ఏం చేశానన్న ప్రశ్నకు ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఈ ఎన్నికల్లో సమాధానం చెబుతారని నాగేశ్వర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: చట్టసభల్లో గొంతెత్తే అవకాశం ఇవ్వండి: రాములు నాయక్