కరోనా పేరుతో రాజధానిలోని కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు అనుమానితులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. అవసరాన్ని ఆసరాగా చేసుకుని రేట్లను పెంచాయి. కరోనా నిర్ధారణ కోసం ఛాతి సీటీస్కాన్‌కు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇతర పరీక్షలకూ అదే పరిస్థితి. దీంతో రేట్లు పెంచి నిలువు దోపిడీ చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుడి సిఫార్సు లేకుండానే సీటీ స్కాన్..
మహానగరంలో చిన్నా, పెద్దా ల్యాబ్‌లు 2- 3వేల వరకు ఉన్నాయి. గతంలో వీటిలో సగం వరకు ఖాళీగా ఉండేవి. కరోనా నేపథ్యంలో గల్లీల్లో ఉన్న చిన్న ల్యాబ్‌లకు కూడా అనుమానితులు పరుగులు తీస్తున్నారు. ఆర్టీపీసీఆర్, సీటీ స్కాన్, డీడైమర్, వివిధ రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు. కొంతమంది ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో వైద్యులను సంప్రదించకుండానే సీటీస్కాన్ చేయిస్తున్నారు. కొవిడ్ రాకముందు సీటీస్కాన్‌కు రూ.3 వేలు ఆపైన వసూలు చేసేవారు. ప్రస్తుతం బంజరాహిల్స్‌లోని ఒక ల్యాబ్ రూ.8 వేల నుంచి రూ.12వేలు వసూలు చేస్తోంది. అదే కూకట్‌పల్లిలోని మరో ల్యాబ్‌లో కొద్ది గంటల్లోనే నివేదిక కావాలంటే కనీసం రూ.15 వేలు ఇవ్వాల్సిందే.
డీడైమర్ పరీక్షకు రూ.2500 వసూలు చేసేవారు. ఇప్పుడు అదే పరీక్ష రూ.3500 నంచి రూ.6500 వరకు వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తం చెల్లించినా పరీక్షా ఫలితం రావాలంటే కనీసం 48 గంటల సమయం పడుతోంది. కొన్ని పేరొందిన ల్యాబ్‌ల్లో సీటీ స్కాన్ చేయించుకోవాలంటే ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలి. నగరంలో ప్రైవేటు ల్యాబ్ దందా ఇంత పెద్దఎత్తున జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కిమ్మనడం లేదు. కిందిస్థాయి అధికారులకు ల్యాబ్‌లతో సంబంధం ఉండటం వల్లే చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఇదీ చూడండి : నేడే లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు