ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రుల దౌర్జన్యం... లక్షల్లో వసూలు - హైదరాబాద్​లో కరోనా చికిత్స

కరోనా సోకి ప్రాణాలు దక్కించుకొనేందుకు ఎక్కడ ఆక్సిజన్‌ సౌకర్యం ఉండే బెడ్‌ దొరుకుతుందో, ఎక్కడ ఐసీయూ సౌకర్యం ఉందోనని పరుగులు పెడ్తున్న నిస్సహాయులను ప్రైవేటు ఆసుపత్రులు నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. వారికి తోడు దళారులు, మందులను నల్లబజారులో విక్రయిస్తున్నవారు బాధితులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు లభిస్తున్నా... అవి అందరికీ అందుబాటులో లేకపోవడంతో చాలా మందికి ప్రైవేటు ఆసుపత్రులే దిక్కవుతున్నాయి.

private-hospitals-fee-is-very-high-for-corona-patients-in-telangana
ప్రైవేటు ఆస్పత్రుల దౌర్జన్యం... రూ.లక్షల్లో వసూలు
author img

By

Published : May 5, 2021, 8:24 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతానికి చెందిన రైతు సత్యనారాయణ కొవిడ్‌ బారిన పడితే మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌ తీసుకొచ్చారు. మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చితే..ఆ హాస్పటల్‌ రోజుకు వసూలు చేసిన మొత్తం రూ.90 వేలు. రెండు వారాలు ఆసుపత్రిలో ఉన్నా మంగళవారం ఆయన కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకూ చెల్లించిన రూ.9 లక్షలు పోనూ మరో రూ.3.5లక్షలు కడితేనే శవాన్ని ఇస్తామనడంతో ఆ కుటుంబం ఎలాగోలా ఆ మొత్తం కట్టి హైదరాబాద్‌లోనే దహన సంస్కారాలు చేసి కన్నీళ్లతో సొంతూరు వెళ్లింది. భూమి అమ్ముకుని ఆ మొత్తం ఖర్చు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సత్యనారాయణ కుటుంబానికి ఎదురైన ఇటువంటి పరిస్థితి పలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న అనేకమందికి ఎదురవుతోంది. అధికశాతం మంది అత్యవసర పరిస్థితులలో ప్రాణాపాయం ఉంటుందనే భయంతో చికిత్స కోసం తప్పనిసరై ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ముందుగా రూ.లక్ష డిపాజిట్‌ చేస్తేనే వారికి ఆయా ఆసుపత్రులు చికిత్సను ప్రారంభిస్తున్నాయి. రోగనిర్ధారణ పరీక్షలు, స్కానింగులు, ఎక్స్‌రేలు, ఔషధాలు, ఇంజక్షన్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌, ఐసీయూలు, అంబులెన్స్‌లు, పడకలు, వివిధ రకాల సేవల పేరిట రుసుములు వేసి రూ. 2 లక్షల నుంచి రూ.15 లక్షలు లేదా అంత కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆస్తులను తెగనమ్ముకుంటున్నారు. మరికొందరు అప్పుల్లో కూరుకుపోతున్నారు.

ఐసీయూ బెడ్‌కు రూ.1.25 లక్షలు

ఉదాహరణలో హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తల్లి కరోనా బారిన పడ్డారు. ఆమెను మొదట నగరంలోని టిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉందని, రూం లేదని చెప్పడంతో హడావుడిగా కాచిగూడలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇంకొకరితో కలిసి రూంలో ఉంచినట్లు తెలిసింది. రెమ్‌డెసివిర్‌ మందులూ కొనిపించారు. మూడు రోజులు అక్కడ ఉన్న తర్వాత మొదట 97 ఉన్న ఆక్సిజన్‌ స్థాయి క్రమంగా 72కు పడిపోయింది. అప్పుడు ఇక్కడ ఐసీయూ ఖాళీలేదని, ఇంకెక్కడికైనా తీసుకెళ్లమని సూచించారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి రూ.50వేలు ఇస్తే ఐసీయూ బెడ్‌ ఇప్పిస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించి అతని సహాయంతో కూకట్‌పల్లిలోని ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. అక్కడ మందులకు కాకుండా రోజుకు రూ.లక్షా 25 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

పుట్టుకొచ్చిన దళారులు

కరోనా బాధితులకు ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు ఇప్పించడానికి మధ్య దళారులు తయారయ్యారు. వీరు ఆసుపత్రి వర్గాలతో సంబంధాలు నెరపుతూ బెడ్‌ల ఖాళీ వివరాలు తెలుసుకుని బాధితుల నుంచి వేలాది రూపాయలు డిమాండ్‌ చేసి వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆసుపత్రుల మధ్య సిండికేట్‌ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సరైన సదుపాయాలు, వైద్యులు లేకుండానే ఆక్సిజన్‌ సౌకర్యం ఉందని చేర్చేసుకుంటున్నారు. ఆపై ఐసీయూ సౌకర్యం ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ సూచిస్తున్నారు. ప్రధాన కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో బెడ్‌ లభించే అవకాశం లేక ఎక్కడ బెడ్‌ ఉందంటే అక్కడకు వెళ్లడం, కుటుంబ సభ్యుల ప్రాణాలు దక్కించుకొవడానికి ఎంత చెపితే అంత చెల్లించాల్సి రావడం బాధితులకు సాధారణమైపోయంది.

నిరుపేదల కష్టాలకు మరికొన్ని ఉదాహరణలు

  • హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన సాంబయ్య కార్పెంటర్‌. భార్యా, ఇద్దరు పిల్లలతో అరకొర సంపాదనతో జీవిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమంగా ఉందనడంతో అప్పు చేసి రూ.లక్ష చెల్లించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. మరో రూ.1.50 లక్షలు చెల్లిస్తేనే డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో మరోసారి ముగ్గురు బంధువులకు ఫోన్‌ చేసి వారి వద్ద తలా రూ.50 వేల చొప్పున అప్పు తీసుకొని ఆసుపత్రిలో చెల్లించి, ఇంటికి చేరారు. కరోనా తగ్గినా సంపాదన లేక రూ. 2.50 లక్షల అప్పు తిరిగి చెల్లించడమెలా అని ఆందోళన చెందుతున్నారు.
  • భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ ఫణీందర్‌ (48)కు ఏప్రిల్‌ 4న కరోనా సోకింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ నాలుగు రోజులకు రూ. 2.40 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత ఆక్సిజన్‌ లేదని చెప్పడంతో మరో ఆసుపత్రిలో చేరారు. అక్కడ రూ. 6 లక్షల బిల్లు వేశారు. అప్పులు చేసి ఆ మొత్తం చెల్లించిన తర్వాత ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
  • కరీంనగర్‌ శివారు సీతారాంపూర్‌కు చెందిన తిరుపతి మెడికల్‌ ఏజెన్సీలో ఉద్యోగి. వారం రోజుల క్రితం కరోనాతో కరీంనగర్‌ నగరంలో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఇప్పటి వరకు చికిత్స కోసం రూ.నాలుగు లక్షలు చెల్లించారు. స్నేహితుల వద్ద అప్పు చేసి చికిత్స పొందుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

అమలు కాని ప్రభుత్వ ధరలు

ప్రైవేటులో ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్‌లకు రోజుకు ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు మించి వసూలు చేస్తే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. అయినా ఈ దోపిడీని అడ్డుకునేందుకు ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు కనిపించడంలేదు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైసా ఖర్చు కాదు

రమేశ్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు

ఎవరికైనా కరోనా లక్షణాలుంటే భయభ్రాంతులై ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా కరోనాకు చక్కటి చికిత్సను అందిస్తున్నాం. ప్రైవేటు ఆసుపత్రికి పోవాల్సిన అవసరమే లేదు. గాంధీ ఆసుపత్రిలో దేశంలోనే అత్యధికంగా 600కి పైగా వెంటిలేటర్ల సదుపాయం ఉంది. టిమ్స్‌లోనూ అత్యుత్తమ సౌకర్యాలున్నాయి. ఇవేగాక రాష్ట్రంలోని వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, సిద్దిపేట, సిరిసిల్ల... ఇలా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కరోనాకు చికిత్స లభిస్తోంది. ఆసుపత్రికి వచ్చిన వారినందరినీ చేర్చుకుంటున్నాం.

- రమేశ్‌రెడ్డి, తెలంగాణ వైద్యవిద్య సంచాలకుడు

ఇదీ చూడండి: తెలుగురాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం డబుల్‌ మ్యూటెంట్ వైరసే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.