రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్న సమయంలో రాజకీయ పార్టీలు వాటిని రాజకీయం చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్లు విజ్ఞప్తి చేశాయి. ప్రతి జ్వరం డెంగీ కాదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాయి. ఈ ఏడాది డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురువుతున్నారన్నాయి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని.. ఇంట్లో పూలకుండీలు, తాగేసిన కొబ్బరి బొండాలు, టైర్లు తదితర వస్తువులు ఉండకుండా చూడాలని ప్రజలకు సూచించాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సేవా భావంతో పని చేయాలని... ప్రతి రోజూ ఒక గంట ఎక్కువగా సమయం రోగులకు కేటాయించాలని తెలిపాయి. ఉచిత వైద్య శిబిరాలు చేపట్టాలని కోరాయి. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎమ్‌ఏ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, తానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఆక్సిజన్ అందక చేపల మృతి