President will visit Yadadri Today: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది విడిది ఇవాళ్టితో పూర్తి కానుంది. చివరి రోజైన ఇవాళ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు యాదాద్రి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. యాదాద్రి హెలిప్యాడ్ నుంచి కార్ల కాన్వాయ్ ద్వారా కొండపైకి చేరుకుంటారు. 10 గంటల నుంచి 10.30 వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు స్వయంభువులను రాష్ట్రపతి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపడతారు.
ఈ అరగంటలో రాష్ట్రపతికి పూర్ణకుంభ స్వాగతం, దైవారాధనలు, వేదాశీస్సుల పర్వాలు జరుగుతాయి. అనంతరం దేవాలయం నుంచి కాన్వాయ్‌లో బయల్దేరనున్న రాష్ట్రపతి కొండకింద హెలిప్యాడ్‌కు చేరుకుని 20 నిమిషాల్లో బొల్లారం చేరుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా యాదాద్రిలో భద్రత, పర్యటన స్వాగత ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. కొండకింద యాగ స్థలంలో మూడు హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. 1200 మందితో పటిష్ట పోలీస్ బందోబస్తును ఉంచారు.
శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యాదాద్రీశుల దర్శనం, ఆర్జిత పూజలు నిర్వహణకు భక్తులను అనుమతించేది లేదని దేవస్థానం ఈవో గీత వెల్లడించారు. రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికేందుకు అంతా సన్నద్ధంగా ఉన్నామని, ప్రధాన అర్చకులు వెల్లడించారు. యాదాద్రి నుంచి బొల్లారం చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, మిలటరీ వారికి, కుటుంబ సభ్యులకు విందు ఇవ్వనున్నారు. విడిది ముగించుకొని సాయంత్రం దిల్లీ తిరుగు పయనం కానున్నారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.
ఇవీ చదవండి: