Alluri 125th birth anniversary celebrations at Hyderabad : మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు 125వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటుగా ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏపీలోని భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి స్మృతివనాన్ని వర్చువల్‌గా ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
అలాగే 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ద్రౌపది ముర్ము.. అన్యాయాలపై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి జీవనగాథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆమె సూచించారు. భగత్ సింగ్ బలిదానం తరహాలో.. అల్లూరి సీతారామరాజు త్యాగనిరతి యావత్ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. అల్లూరి జీవితం ఒక స్పూర్తిదాయకమని గవర్నర్ తమిళిసై అన్నారు. అలాంటి వ్యక్తి జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. అల్లూరి భారతమాత ముద్దు బిడ్డ అని కొనియాడారు.
- Draupadi Murmu Hyderabad Tour : హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. గవర్నర్, సీఎం ఘన స్వాగతం
- Telangana Formation Day Wishes : 'అద్భుత నైపుణ్యాలు.. సాంస్కృతిక వైభవం తెలంగాణ సొంతం'
"అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశభక్తి అసమానమైనది. అల్లూరి ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో ఆంగ్లేయులపై పోరాటం చేశారు. నేతాజీ పోరాటం వలే అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపింది. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలి". - ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి
CM KCR at Alluri Jayanti celebrations : కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బ్రిటీష్ బంధనాల నుంచి భారత మాత విముక్తి కోసం పోరాడిన వీరుడు అల్లూరి అని కొనియాడారు. అల్లూరి గొప్పతనాన్ని, చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు దైవాంశ సంభూతుడుగా అభిప్రాయపడ్డారు. అల్లూరి గురించి రాసిన 'తెల్లవారి గుండెల్లో నిదిరించిన వాడా' అనే సినిమా పాటను ఎంతో ఇష్టంగా వినేవాడినని గుర్తు చేసుకున్నారు.
Kishan Reddy at Alluri Jayanti celebrations : ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. గొప్పవ్యక్తుల స్మరణతోనే చరిత్రకు గుర్తింపు వస్తుందన్నారు. చరిత్ర స్మరించుకోదగ్గ వీరుడు అల్లూరి సీతారామరాజు అని అభిప్రాయపడ్డారు. 125వ జయంతి వేళ దేశమంతా గర్వంగా నివాళి అర్పిస్తోందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రధాని మోదీ స్వయంగా అల్లూరి జయంతి ఉత్సవాలు ప్రారంభించారని పేర్కొన్న ఆయన.. ముగింపు ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
అల్లూరిలో వీరత్వమే కాదు.. అనేక కోణాలు ఉన్నాయని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. అల్లూరి వీరుడు మాత్రమే కాదని.. వైద్యుడు, ఆధ్యాత్మిక వేత్త అని కొనియాడారు. వందలాది గిరిజన సైనికులను అల్లూరి తయారు చేశారని పేర్కొన్నారు. 'అల్లూరి ఒక వ్యక్తి కాదని.. శక్తి అని అతడే ఒక సైన్యం' అని.. అల్లూరి ఒక వర్గానికే పరిమితమైన వ్యక్తి కాదని తెలిపారు.
ఇవీ చదవండి: