రాష్ట్రంలో సోమవారం నుంచి ప్లాస్మాథెరపీ అందుబాటులోకి రానుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న 15 మంది నుంచి సోమవారం ప్లాస్మాను సేకరించనున్నారు. ఒక్కొక్కరి నుంచి 400ఎంఎల్ల రక్తాన్ని సేకరించి.. ప్లాస్మాను వేరుచేయనున్నారు.
మరోవైపు మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారిలో దాదాపు 200 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే వైద్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యులు వారిని మరోసారి సంప్రదించనున్నారు.
ఇక ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో కేవలం ఐదుగురు మాత్రమే ప్లాస్మా థెరపీకి అర్హులుగా వైద్యులు తేల్చారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే ఈ థెరపీని నిర్వహించనున్నట్టు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు.