Drowning deaths in Telangana: వేసవి సెలవులు వచ్చాయంటే కొంత మంది పిల్లలు అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తారు.. మరి కొంత మంది ఆన్లైన్ క్లాసులు వంటివి వింటూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకుంటారు. కాని చాలా మంది పిల్లలు, యువత మాత్రం ఈత కొట్టాలని అనుకుంటారు. ఎందుకంటే అందులో వచ్చే సరదా మరి ఇంకా ఎక్కడికి వెళ్లిన రాదు కాబట్టి. ఈతకు అయితే స్నేహితులతో కలిసి ఎంచక్కా వెళ్లవచ్చు.. బావుల్లోనూ, చెరువుల్లోనూ, వాగుల్లోనూ సరదాగా గడపవచ్చు. కాని ఆ సరదానే కొన్నిసార్లు తమ ప్రాణాలను తీసే అవకాశం ఉందని ఆలోచించరు.
Swimming in Summer in Telangana : అందుకు తగిన జాగ్రత్తలను కూడా పాటించరు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి.. ఎందుకంటే వారు నీళ్లను చూడగానే ఆకర్షితులవుతారు. తల్లిదండ్రులకు తెలియకుండా దొంగచాటుగానైనా సరే వెళ్లి.. ఈత రాకున్నా నీటిలో దిగడానికి యత్నించి ప్రాణాలను పోగొట్టుకున్న వారు ఎందరో. తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగుల్చుతున్నారు. అయితే తాజాగా జనవరి నుంచి ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాలో ఈత రాక 13 మంది మృతి చెందారని గణాంకాలు చెపుతున్నాయి. అందుకే ఈతకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. మరణాల నుంచి బయటపడొచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. చెరువుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
2. వ్యవసాయ బావుల దగ్గర కంచె వంటివి ఏర్పాటు చేయాలి.
3. చెరువులు, ఇతర జలాశయాల్లో అడుగున బురద పేరుకుపోయి ఉండడంతో.. జాగ్రత్త తీసుకోవాలి.
4. చెరువులు, వాగుల దగ్గర పరిస్థితులు తెలుసుకోకుండా ఈతకు దిగినా.. చేపలు పట్టేందుకు యత్నించినా ప్రాణాలు పోతాయి. తగు సూచనలతో బోర్డులు ఏర్పాటు చేయాలి.
5. ఈత వచ్చిన ఎంత లోతు ఉంటుంది.. అడుగున బండలు, మట్టి లాంటివి ఉంటాయేమోనని జాగ్రత్తగా చూసుకొని.. దిగాలి.
6. పిల్లలు ఈత నేర్చుకోవాలనుకుంటే నిపుణులైన ఈతగాళ్ల సమక్షంలో తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్పించాలి.
ఈ మధ్యకాలంలో ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటనలు..
1. ఈ సంవత్సరం జనవరి 15న పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు కోట్పల్లి ప్రాజెక్టుకు ఈతకు వెళ్లారు. ఈత రాక నీటమునిగి మృతి చెందారు.
2. 2021లో హైదరాబాద్కు చెందిన నలుగురు యువకులు విహార యాత్రకు ఈ కోట్పల్లి ప్రాజెక్టుకు రాగా.. వీరిలో ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు.
3. 2022 అక్టోబరులో గోదంగూడ శివారులోని ఓ రిసార్ట్లో.. ఐదుగురు స్నేహితులు ఐదు చీటీల్లో పేర్లు రాసి డబ్బాల్లో పెట్టి బావిలో వేశారు. ఎవరి పేరిట ఉన్న డబ్బాను వారు వెతికి తెస్తే.. గెలిచినట్లుగా పందెం కట్టుకున్నారు. ఈ ప్రయత్నంలో బావిలో దూకిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయికుమార్ ఈత రాక బావిలో పడి మృత్యువాత పడ్డాడు.
ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలి.. సెలవులకు సొంత ఊళ్లకు పిల్లలతో వెళ్లినవారు వారిపై ఓ కన్నేసి ఉంచాలని వికారాబాద్ జిల్లా పోలీసు అధికారి కోటిరెడ్డి తెలిపారు. స్నేహితులతో కలిసి పొలం గట్ల వెంబడి, చెరువులు, కుంటల్లోకి వెళ్లి సరదాగా గడపాలని చూస్తారని చెప్పారు. పొలం దగ్గర చెట్లు ఎక్కి కిందపడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే చెరువులు, కుంటల్లో ఈత కొట్టడానికి వెళ్లి లోతు తెలియక, ఈత రాక మృత్యువాత పడతారని వివరించారు. అందుకే పిల్లలు ఎవరితో ఆడుకుంటున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని గమనించి తగు సలహాలు, సూచనలు చేయాలని కోరారు.
ఇవీ చదవండి: