Pre Christmas Celebrations in Telangana 2023 : రాష్ట్రంలో ప్రీ క్రిస్మస్ వేడుకల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సర్కారు తరఫున నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సహా స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఏసుక్రీస్తు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శ పాలన అందిస్తామని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేదల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి, అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు.. పాల్గొన్న ప్రజాప్రతినిధులు
"తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యం పేదల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి, అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది. మత సామరస్యం కాపాడటంతో పాటు ఇమామ్‌లకు, మౌజమ్, చర్చిలలో ప్రార్థనలు చేసే వారికి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించాం. అర్హులైన అందరికీ తప్పక అవకాశం కల్పిస్తాం."-రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
Harish Rao In Siddipet : సిద్దిపేటలో జరిగిన వేడుకలకు హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు కేక్ కోసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో చర్చిల నిర్మాణానికి తన వంతు సహకారం అందించానని వివరించారు. ఏసుప్రభు దీవెనలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
"సిద్దిపేట నియోజకవర్గంలో చర్చిల నిర్మాణానికి నా వంతు సహకారం అందించాను. ఏసుప్రభు దీవెనలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగాలి. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తరఫున సహాయ సహకారాలు అందిస్తా."- హరీశ్‌రావు, మాజీ మంత్రి
క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైన మెదక్ చర్చి.. ఒకసారి చరిత్ర చూద్దామా?
Pre Christmas Celebrations Nalgonda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రాష్ట్రప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆర్డీవో చెన్నయ్య పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు బోధనలను వివరించారు. అనంతరం క్రైస్తవులకు సర్కారు తరఫున విందు ఏర్పాటు చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కుక్కింగ్, రిసెప్షన్, డెక్కర్ ఇలా పలు విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి మెప్పించారు.
నాంపల్లిలో ప్రీ క్రిస్మస్ వేడుకలు : క్రిస్మస్ ట్రీ కేకుతో తయారు చేసిన క్రిస్మస్ అలంకరణ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. నాంపల్లిలో జరిగిన ప్రీ క్రిస్మస్ సంబురాల్లో ఉద్యోగులు అనాథపిల్లలకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి లోని హైదరాబాద్ టిఎన్జీవోస్ యూనియన్ యూనియన్ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో డాన్ బాస్కో అనాధ శరణాలయ పిల్లలతో కలిసి ఉద్యోగులు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ముజీబ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉద్యోగులు నూతన ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా, బంగారు తెలంగాణ నిర్మాణంలో చురుకైన పాత్ర వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డాన్ బాస్కో అనాధ శరణాలయ పిల్లలకు సంవత్సరం పాటు నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.
5400 గులాబీలతో శాంటాక్లాజ్ సైకత శిల్పం
LIVE : ఎల్బీ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు - హాజరైన సీఎం రేవంత్ రెడ్డి