Pravalika Suicide Accused Shivaram Arrest : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రవళిక(Pravalika Suicide) ఆత్మహత్య కేసులో.. నిందితుడు శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్ చిక్కడపల్లిలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ప్రియుడు శివరాం వల్లే.. ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. శివరాంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శివరాం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. శివరాం అరెస్టును పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.
Pravalika Family Members Meet KTR : ప్రవళిక చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించడం లేదు. ప్రవళిక మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగడం, గ్రూప్ పరీక్షల వాయిదాల వల్లే మానసిక ఒత్తిడితో చనిపోయిందని సహచరులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగడంతో.. ఈ విషయం రాజకీయరంగు పులుముకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు అర్థరాత్రి ఆందోళనకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు మృతురాలి స్నేహితులను ప్రశ్నించారు. శివరాంతో పరిచయం గురించి వారు చెప్పగా ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రవళిక చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించకపోవడం కూడా వారి అనుమానాలను మరింత పెంచింది. ఆమె సెల్‌ఫోన్ డేటా, వాట్సప్ చాట్ రికవరీ చేసి శివరాం వేధింపుల వల్లే చనిపోయిందని నిర్థరణకు వచ్చారు.
Group-2 Aspirant Pravalika Suicide : ఇదే విషయాన్ని ప్రవళిక కుటుంబసభ్యులు కూడా రెండు రోజుల క్రితం మీడియాకు వివరించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని సూచించారు. మరోవైపు కేటీఆర్ కూడా మృతురాలి కుటుంబసభ్యులతో సమావేశయ్యారు. ప్రవళిక అత్మహత్యకు కారణమైన శివరాం పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రణయ్(ప్రవళిక సోదరుడు)కు ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టాక.. కస్టడీ రిమాండ్ కోరే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శివరాంను ప్రశ్నిస్తే.. మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.
మరోవైపు..తమకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని శివరాం కుటుంబ సభ్యులు.. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. శివరాం అచూకీ చెప్పాలంటూ.. పోలీసులు తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను, తమ బంధువులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి.. శివరాం ఆచూకీ తెలుపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఒకవేళ శివరాం ఆచూకీ తెలిస్తే పోలీసులకు తప్పనిసరిగా తెలియజేస్తామన్న.. పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.
Pravallika Last Rites Complete : అశ్రునయనాల మధ్య ప్రవల్లికకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు