కేంద్ర నూతన విద్యా విధానం ముసాయిదాపై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థపై కేంద్రం పెత్తనం చేసే విధంగా ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటో స్పష్టతనివ్వలేదని పేర్కొన్నారు. ముసాయిదాపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నందున సూచనలు ఇచ్చేందుకు గడువు పెంచాలని కోరినట్లు ఆయన తెలిపారు.
కేంద్రం పెత్తనం ఏమిటి?
విద్యకు సంబంధించిన ప్రతి అంశానికి ప్రధాని ఛైర్మన్‌గా ఎందుకని జగదీశ్‌రెడ్డి అన్నారు. పాఠశాల ఎక్కడ పెట్టాలి, ఎవరు ఎలా బోధించాలో కూడా కేంద్రం నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. నూతన విద్యా విధానాన్ని తాము వ్యతిరేకించట్లేదని.. అందరికీ మేలు చేసేలా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. ముసాయిదాపై అధ్యయనం చేయాల్సి ఉన్నందున రేపటితో ముగియనున్న గడువును నెల రోజులు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. త్వరలో సీఎం కేసీఆర్ విద్యా శాఖపై సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నూతన విద్యా విధానంపై ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, నిపుణులు స్పందించారు. సంస్కరణలు అవసరమంటుూనే పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక విద్యపై రాష్ట్రానికి, స్థానిక సంస్థలకే నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలని ఆకాక్షించారు.
విరాళాల కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్
దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. చర్చాగోష్ఠిలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు, విద్యావేత్తలు, నిపుణులు, విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: జీవన్‌రెడ్డి