వెయిటేజీపై వివాదం తలెత్తడం వల్ల స్టాఫ్ నర్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. రేపటి నుంచి ఈనెల 19 వరకు జరగాల్సిన ధ్రువపత్రాల పరిశీలన వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది. వైద్యారోగ్య శాఖలో స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టిన టీఎస్ పీఎస్ సీ ఈనెల 7న 21, 391 మంది మెరిట్ జాబితా ప్రకటించింది.
అదేవిధంగా 311 పోస్టుల కోసం ఒక్కో ఉద్యోగానికి ఇద్దరు చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. తమకు సర్వీస్ వెయిటేజీ కలపలేదని కొందరు... తక్కువగా కలిపారని మరికొందరు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. టీఎస్ పీఎస్ సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అభ్యర్థుల ఫిర్యాదులను వైద్యారోగ్య శాఖకు పంపించినట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. వైద్యారోగ్య శాఖ నివేదిక అందిన తర్వాత అవసరమైతే మెరిట్ జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటాయని టీఎస్ పీఎస్ సీ తెలిపింది.