కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. ప్రశ్నాపత్రాల్లో మార్పులపై సూచనలకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీలను నియమించింది. ఆ కమిటీలు ఛాయిస్ పెంపు, ఇతర సిఫారసులతో నివేదికలను ఇటీవల పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనకు అందజేశాయి. తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆమె తాజాగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
ఇప్పటికే 11 పరీక్షలకు బదులు ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష నిర్వహించేలా పరీక్షల కాలపట్టికను ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఒక మార్కు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలను మినహాయించి మిగిలిన ప్రశ్నలకు మరింత ఛాయిస్ పెంచాలని తాజాగా కమిటీలు సిఫారసు చేసినట్లు తెలిసింది. వాటికి ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. 2015లో నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానాన్ని అమలుచేస్తూ అందులో 4 ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ)లు జరపాలని అప్పట్లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈసారి 2 ఎఫ్‌ఏలే ఉంటున్నందున జీఓలో సవరణలు చేయాల్సి ఉం టుంది. 11కు బదులు 6 పేపర్లు, సైన్స్‌లో 2 ప్రశ్నాపత్రాలపైనా జీవోలో సవరణలు చేయనున్నారు.
సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల్లోనూ...
- సీబీఎస్‌ఈ సైతం పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో కొత్త ఒరవడి తెస్తోంది. అసలైన విద్యా సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నల శాతాన్ని ఏటా పెంచుతోంది. కేస్‌స్టడీలు ఇచ్చి అందులోంచి ప్రశ్నలు అడగడం, పరిష్కారం చూపమనడం లాంటివి ఇస్తున్నారని విజ్ఞాన్ పాఠశాల ప్రిన్సిపల్ వందన తెలిపారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలను సమగ్రంగా చదవడం లేదని భావించిన సీబీఎస్‌ఈ ఈసారి వాటిలోని పేరాగ్రాఫ్‌లను యథావిధిగా ఇచ్చి ప్రశ్నలు అడగనుందని ఆమె చెప్పారు.
- 2019-20 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి గణితంలో రెండు రకాల ప్రశ్నాపత్రాలు(ప్రాథమిక, ప్రామాణికం) ఇవ్వడాన్ని సీబీఎస్‌ఈ ప్రారంభించింది. వచ్చే విద్యాసంవత్సరం(2021-22) నుంచి ఆంగ్లం, సంస్కృతంలోనూ రెండు రకాల ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: ఫిట్మెంట్ పేరుతో కొత్త డ్రామా: డీకే అరుణ