Telangana Decade Celebrations 2023 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిషన్ కాకతీయ ప్రగతిని వివరించేలా వేడుకలు జరగనున్నాయి. గ్రామపంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో "ఊరూరా చెరువుల పండుగ" పేరుతో వీటిని నిర్వహించనున్నారు. గ్రామం నుంచి చెరువు వరకు డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్య్సకారుల వలలతో ఊరేగింపు నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. రైతులు, మహిళలు, మత్య్సకారులు ఇలా అన్ని వర్గాల వారు వేడుకల్లో పాల్గొనేలా చూడాలని పేర్కొంది.
Mission Kakatiya Scheme In Telangana : పండుగ వాతావరణం ఉట్టిపడేలా చెరువు గట్టుపై ముగ్గులు, తోరణాలతో అలంకరించాలని.. కట్టమైసమ్మ, చెరువు నీటికి పూజ చేయాలని తెలిపింది. ఆ తర్వాత చెరువుకట్టపైనే సభ నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ, కోలాటాలు ప్రదర్శించాలని పేర్కొంది. గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.. మా ఊరి చెరువు తదితర పాటలను వినిపించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా స్పష్టం చేసింది. చెరువుల పునరుద్ధరణతో వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్య్స సంపద, భూగర్భ జలాల పెరుగుదల, తదితర వివరాలను ప్రదర్శించడంతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలని పేర్కొంది.
Tank Festival In Telangana Decade Celebrations 2023 : మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణతో 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగినట్లు తెలిపింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాల నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పేరిట బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొంది. సమైక్యపాలనలో చెరువుల వ్యవస్థ చిన్నాభిన్నమై గంగాళాల వంటి చెరువులు పూడిక నిండి తాంబాళాల్లా మారాయని.. వాటికి నవజీవం తెచ్చేలా కాకతీయుల స్మరణలో చెరువుల పునరుద్ధరణ చేపట్టినట్లు తెలిపింది.
Ponds Festival In Decade Celebrations : మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో 47 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని చెప్పింది. రూ.5,350 కోట్లు వెచ్చించి చెరువులను పునరుద్ధరించడంతో పాటు విరివిగా చెక్ డ్యాంల నిర్మాణంతో వాగులకు పునరుజ్జీవంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయిందని వివరించింది. దాదాపు 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని పేర్కొంది.
Restoration of Ponds under Mission Kakatiya Scheme in Telangana : రూ.3,825 కోట్లతో చేపట్టిన 1200 చెక్ డ్యాంలకుగానూ మొదటి దశ 650 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయిందని.. మిగతా చెక్ డ్యాంల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని సర్కార్ తెలిపింది. అలాగే దీని ద్వారా పునరుద్ధరించిన చెరువులకు భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించి ఎండాకాలంలో సైతం పూర్తి స్థాయి నీటి నిల్వతో చెరువులు నిండుగోలాలుగా తయారయ్యేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశంలో నేడు చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం ఉబికి ఉబికి పైకి వస్తున్నాయని తెలిపింది. చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో ఆకుపచ్చ తివాచీ పరచినట్టు కనిపిస్తూ పంట పొలాలు కనువిందు చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ చదవండి: