స్వరాష్ట్రం సిద్ధించి ఆరేళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వపరంగా తమకు తగిన గుర్తింపు లభించలేదని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఈ నెల 21న తమ సంఘం అధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న కుందారం గణేష్ చారి మాట్లాడారు. 30 ఏళ్లుగా విశ్వబ్రాహ్మణుల సమస్యలపై పోరాటం చేస్తున్న తనను అధ్యక్షుడిగా గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
స్వరాష్ట్ర సాధనలో తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ నిర్విరామ కృషి, శ్రీకాంతాచారి లాంటి త్యాగమూర్తుల బలిదానాలు మరువలేనివని కుందారం గణేష్ చారి అన్నారు. రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 15 లక్షల వరకు ఉన్న విశ్వబ్రాహ్మణులు నేడు వివిధ ప్రైవేటు ఉద్యోగాలతో నెట్టుకొస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల వారిని కలుపుకొని వేదాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక నూతన 'విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘాన్ని' ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తనను అధ్యక్షుడిగా గెలిపిస్తే ప్రభుత్వం నుంచి రావలసిన సంక్షేమఫలాలు సక్రమంగా అందేలా కృషి చేస్తానని అన్నారు.
ఇదీ చదవండి: కోరమీసాల మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీ