Political Parties Focus on Telangana Border Constituencies : రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు.. అక్కడి నియోజకవర్గాలకు ఓ ప్రత్యేకత ఉంది. అసెంబ్లీలోని మూడో వంతు స్థానాలు సరిహద్దుల్లోనే ఉన్నాయి. కాగా.. పలువురు కీలక నేతలు ఆ స్థానాలకు ప్రాతినిధ్యం వహించడం.. పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఇప్పుడు ఆ స్థానాలపై పడింది. ముఖ్యనేతలైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వంటి నేతలు ఈ స్థానాల నుంచే పోటీ చేస్తుండడంతో అన్ని పార్టీలకు ఈ స్థానాలు ప్రతిష్ఠాత్మకమయ్యాయి.
Telangana Assembly Elections Candidates : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మహారాష్ట్ర సరిహద్దు నియోజకవర్గమైన సిర్పూర్ నుంచి తొలి సారి పోటీ చేస్తున్నారు. సిర్పూర్‌తో పాటు మరో సరిహద్దు స్థానమైన నిర్మల్‌లో 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం.
రాష్ట్రంలో మొత్తం సరిహద్దు నియోజకవర్గాలు 36
ఆంధ్రప్రదేశ్(13) | మహారాష్ట్ర(12) | కర్ణాటక(8) | రెండేసి రాష్ట్రాలు(3) |
అచ్చంపేట | సిర్పూర్ | కొడంగల్ | ములుగు |
కొల్లాపూర్ | చెన్నూరు | నారాయణపేట | భద్రాచాలం |
వనపర్తి | బెల్లంపల్లి | ముక్తల్ | నారాయణఖేడ్ |
నాగార్జున సాగర్ | ఆసిఫాబాద్ | గద్వాల | - |
మిర్యాలగూడ | ఆదిలాబాద్ | అలంపూర్ | - |
హుజూరాబాద్ | బోథ్ | వికారాబాద్ | - |
కోదాడ | నిర్మల్ | తాండూరు | - |
పాలేరు | ముథోల్ | జహీరాబాద్ | - |
మధిర | బోధన్ | - | - |
వైరా | జుక్కల్ | - | - |
సత్తుపల్లి | బాన్సువాడ | - | - |
కొత్తగూడెం | మంథని | - | - |
అశ్వారావుపేట | - | - | - |
ఉమ్మడి ఆదిలాబాద్‌లో (8) : ఇక్కడ ఆసిఫాబాద్ మినహా మిగిలిన 7 నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆసిఫాబాద్‌లో ఒక్కస్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ప్రస్తుతం బోథ్‌లో బీజేపీ అభ్యర్థిగా ఎంపీ సోయం బాపురావు బరిలో దిగడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప (సిర్పూర్), బాల్క సుమన్ (చెన్నూరు), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), జోగు రామన్న (ఆదిలాబాద్), రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), విఠల్‌రెడ్డి (ముథోల్) మరోసారి పోటీ చేస్తున్నారు. బోథ్‌లో కొత్త అభ్యర్థి అనిల్‌యాదవ్‌కు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఉమ్మడి నిజామాబాద్ (3) : బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి బరిలో నిలుస్తున్నారు. బోధన్‌లో గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తలపడుతున్నారు. జుక్కల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మంతు షిందేే పోటీ చేస్తున్నారు.
పెద్దపల్లి (1) : మంథనిలో మరోమారు కాంగ్రెస్ ముఖ్యనేత, ఎమ్మెల్యే డి శ్రీధర్‌బాబుతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు తలపడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ (8) : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి నుంచి మళ్లీ బరిలోకి దిగారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో కొడంగల్‌లో ఓటమిపాలు కాగా.. మరోసారి కూడా అక్కడి నుంచే పోటీలో పాల్గొంటున్నారు. నారాయణపేటలో మూడోసారి విజయం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. మక్తల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అలంపూర్‌లో కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పోటీ చేస్తున్నారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సొంత నియోజకవర్గం గద్వాలలో ఈసారి ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి గెలవగా.. తర్వాత బీఆర్ఎస్లో చేరి ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు పోటీ చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి (3) : తాండూరులో రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బరిలో దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జె గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించిన జహీరాబాద్‌లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్(కాంగ్రెస్) తలపడుతున్నారు. వికారాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు.
కామారెడ్డిపైనే స్పెషల్ ఫోకస్ - 34 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు లేకుండా ఎన్నికలు
ఉమ్మడి నల్గొండ (4) : నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కె జానారెడ్డి పోటీకి దూరం కాగా.. ఆయన కుమారుడు బరిలో దిగారు. హుజూర్‌నగర్‌లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో జరిగిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి గెలుపొందగా మరోమారు ఈ ఇద్దరే తలపడుతున్నారు. కోదాడలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి(కాంగ్రెస్) మరోసారి బరిలో దిగారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్ భాస్కర్‌రావు మరోసారి పోటీ చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం (7) : గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, పాలేరు నుంచి ఉపేందర్‌రెడ్డి, మధిరలో భట్టి విక్కమార్క, భద్రాచలంలో పొదెం వీరయ్య నెగ్గగా.. సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేటలో ఎం నాగేశ్వర్‌రావులు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. వైరాలో మాత్రం స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ విజయం సాధించారు. ప్రస్తుతం మధిర, భద్రాచలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కొత్తగూడెం, పాలేరు, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు అధికార పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగారు. భద్రాచలం.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌తోనూ సరిహద్దును పంచుకుంటోంది.
సంగారెడ్డి (1) : ఇక్కడి నారాయణఖేడ్ నియోజకవర్గ స్థానం మహారాష్ట్ర, కర్ణాటకతో సరిహద్దులను కలిగి ఉంది. ఎమ్మెల్యే ఎం భూపాల్‌రెడ్డి (బీఆర్ఎస్) మరోసారి బరిలో దిగారు.
ములుగు (1) : ములుగు నియోజకవర్గం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో సరిహద్దులను కలిగి ఉంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మరోమారు బరిలో నిలిచారు.
2018 ఎన్నికల ఫలితాలు :
- బీఆర్ఎస్: 23
- కాంగ్రెస్: 10
- టీడీపీ: 2
- ఇతర: 1
రణరంగంగా మారిన ఇబ్రహీంపట్నం-కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా నామినేషన్లు, భారీ ర్యాలీలతో అభ్యర్థుల హంగామా