Political Leaders Gifts Distribution in Telangana : రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో పోట్లాటలు కాదండోయ్.. కోట్లాటలు జరుగుతున్నాయి. బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలతో పాటు స్థిరాస్తి వ్యాపారులు, వ్యాపార సంస్థల ప్రముఖులు బరిలో ఉన్న కొన్నిచోట్ల రూ.కోట్లల్లో సమర్పిస్తున్నారు. అడిగిందే తడువు.. ఇందా.. తీసుకో అంటూ ఇచ్చేస్తున్నారు. ఏమీ అడగని వారి దగ్గరికెళ్లి మరీ.. ఏం కావాలని అడిగి తాయిలాలు అందిస్తున్నారు.
రాష్ట్ర పోలింగ్‌కు మరో తొమ్మిది రోజుల సమయం ఉండగానే కొన్ని స్థానాల్లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు కుమ్మరింత పూర్తయినట్లు సమాచారం. ఇకపోతే సభలు, ప్రచారానికి జనం తరలింపు, వాహనాల ఖర్చులు, పోలింగ్‌కు ముందు ఓటర్లకు ప్రత్యేకంగా పంచేవి వీటికి అదనం. బరిలో దిగిన అభ్యర్థులు ఏ గ్రామంలో అడుగు పెడితే అక్కడ తమ మార్కును చూపిస్తున్నారు. గ్రామదేవతల ఆలయాలు మొదలు గుడులు, గోపురాల మరమ్మతులు, పునర్నిర్మాణాలకు నిధులు ఇస్తున్నారు. ప్రార్థనా మందిరాల నిర్వాహకులతోనూ సమావేశమై సాయం అందజేస్తున్నారు. సామాజిక వర్గాల సంఘాల ఆత్మీయ సమ్మేళనాల(Atmiya Sammelanam) నిర్వహణకు ప్రత్యేకంగా డబ్బులు ఇస్తున్నారు.
అధికారమే లక్ష్యంగా ప్రచారాల జోరు- విమర్శలతో రసవత్తరంగా మారుతున్న రాజకీయం
MLA Candidates Tempt Voters With Gifts : కార్తిక మాసం పురస్కరించుకుని వన సమారాధనలు, వన భోజనాల ఏర్పాటుకు కనిష్ఠంగా రూ.2 లక్షల దాకా అభ్యర్థులు సమర్పిస్తున్నారు. ఇప్పుడే ఇంత చేస్తున్నానని.. గెలిస్తే మరెంతో చేస్తానని.. ఒక్కసారి అవకాశం ఇవ్వండని కొందరు, మరొక్క అవకాశం కల్పించండని సీనియర్లు.. ఓటర్లను ప్రాధేయపడుతూ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కొందరు కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ పూర్తి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఎన్నికల అధికారుల దాడుల్లో కొన్నిచోట్ల ఇలాంటి వస్తువులు పట్టుపడ్డాయన్న విషయం తెలిసిందే.
తాయిలాల రూపంలో వన భోజనాలకు రూ.2 లక్షలకు పైగా.. ప్రతి ఆదివారం గ్రామానికి రెండు పొట్టేళ్ల వితరణ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికీ పట్టు చీర.. కుక్కర్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, స్టౌలు అందజేస్తున్నారు. మరోవైపు ఆలయాలకు ఫండ్‌గా రూ.2 లక్షలకు పైగా.. కుల దేవతలు ఆలయాల పునర్నిర్మాణానికి రూ.5 లక్షలు సమర్పిస్తున్నారు. గ్రామాల్లోని ఆలయాల మరమ్మతులకు రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షలు అందిస్తున్నారు. అలాగే నూతన ఆలయ నిర్మాణానికి రూ. కోటికి పైగా ఇస్తున్నారు.
అభ్యర్థులు తాయిలాల రూపంలో ఇస్తున్నవి ఇలా :
- కుల సంఘాల సంక్షేమ భవనాలకు రూ.50 లక్షలు
- కుల సంఘాల సంక్షేమానికి(వెల్ఫేర్) రూ.కోటికి పైగా
- బస్తీలు, కాలనీల్లోని బహిరంగ కమ్యూనిటీ హాళ్లకు రూ.10 లక్షలు
- గ్రామాల్లో కమాన్ల నిర్మాణానికి రూ.10 లక్షలు
- పేదింటి ఆడ పిల్లల వివాహాలకు రూ.లక్షకు పైగా
- సంఘాలకు షామియానా/టెంట్ సామగ్రికి రూ.5 లక్షలు
- యువతకు క్రీడా సామగ్రి/జిమ్ పరికరాలకు రూ.2 లక్షలు
- యువజన సంఘాలకు డీజే కిట్‌కు రూ.3 లక్షలు
- అపార్టుమెంట్లు/గేటెడ్ కమ్యూనిటీల్లో సీసీటీవీలకు రూ.5 లక్షల వరకు
- కూడళ్లలో సోలార్ వీధి దీపాల ఏర్పాటుకు రూ.5 లక్షలు
- పలు సంఘాలకు స్థలం కొని ఇవ్వడానికి రూ.50 లక్షలకు పైగా
- ఏవైనా మరణాలు చోటుచేసుకుంటే.. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.50 వేలు
- అత్యవసర శస్త్రచికిత్సలు.. వైద్య సేవలకు రూ.5 లక్షల వరకు
తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం - తమ అభ్యర్థికే ఓటు వేయాలంటున్న స్టార్ క్యాంపెయినర్లు