Political Leaders Focus on Caste Communities Hyderabad : రాష్ట్ర రాజధానిలో కాలనీ, కుల, సేవా సంఘాలపై రాజకీయ నేతల (Political Leaders) ఒత్తిడి అధికమైంది. కొన్నిచోట్ల పలు సంఘాలకు ప్రధాన పార్టీల నియోజకవర్గ నాయకుల నుంచి బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీకి ఓట్లు వేయించకపోతే ఎన్నికల తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారంటూ సంబంధిత సంఘాల ప్రతినిధులు మదనపడుతున్నారు. ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇదే అదునుగా కొన్ని సంఘాలు అభ్యర్థుల నుంచి భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లోనే జేబులో వేసుకున్నట్లు సమాచారం.
సంఘాలతో పార్టీల సమావేశాలు : ఇప్పటికే ఇంటింటికి తిరిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు ఇప్పుడు కాలనీ, కుల, సేవా సంఘాలపై దృష్టిపెట్టారు. రాజధానిలో సుమారు 5 వేల వరకు కాలనీ సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు (Telangana Congress Leaders) ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే.
శేరిలింగంపల్లి పరిధిలోని కాలనీ సంఘాలతో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమై ఆ పార్టీ అభ్యర్థుల విజయం కోసం మద్దతివ్వాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాలనీ, మత సంఘాల ప్రతినిధులతో ఆదివారం సమావేశమై.. అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర నేతలు కూడా ఆ పార్టీ అగ్రనేతలతో హామీలు ఇప్పిస్తున్నారు.
హైదరాబాద్ వలస ఓటర్లపై అభ్యర్థుల ఫోకస్ - ఓటు ఎక్కడ వేస్తారో తెలియక టెన్షన్ టెన్షన్
మీకు ఎంత డబ్బులు కావాలో ఆడగండి.. మాకే ఓటేయించాలి : తాజాగా ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున నియోజకవర్గ నాయకులు రెండు రోజులుగా ఆయా సంఘాలతో సమావేశమవుతున్నారు. సంఘాల ప్రతినిధులకు కొందరు నేరుగానే హెచ్చరిస్తున్నారు. 'ఈ ఎన్నిక మా నేతకు చావోరేవో అందుకే మీ కాలనీలోని అందరితో ఈసారి మాకే ఓటేయించాలి. మీరు ఇంటింటికి తిరిగి ఆ పని చేస్తారో మరో రకంగా చేస్తారో మీ ఇష్టం. మీకు ఎంత డబ్బు కావాలో అడగండి' అంటూ బెదిరింపులకు దిగుతున్న సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.
చేసేదేమి లేక పలువురు ప్రతినిధులు ఎన్నికల వరకు కాలనీలో ఉండకపోవడం మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కుల సంఘాల ప్రతినిధులను బెదిరిస్తే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉండటంతో వారితో మాత్రం బుజ్జగింపులకు దిగారు. ఇదే అదునుగా కొన్ని సంఘాల ప్రతినిధులు అభ్యర్థుల దగ్గర భారీగా వసూళ్లకు దిగుతున్నట్లు సమాచారం.
మరోవైపు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు తమ చేతిలో ఉన్నా.. తమకు కావాల్సిన నాయకుడిని తామే ఎన్నుకునే సువర్ణావకాశం వారిదే అయినా.. చాలా మంది అందుకు ఆసక్తి చూపడం లేదు. బాధ్యతగా ఓటు వేయాల్సిన ఓటర్లు.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ధోరణి కాస్త తక్కువగా ఉన్నా.. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో మాత్రం ఎక్కువ మంది ఓటుకు దూరంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.
'గ్రేటర్' ఓటరు మహాశయా మేలుకో - ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకో
గ్రేటర్ హైదరాబాద్‌లో తగ్గుతున్న ఓటింగ్ శాతం - ఏ ఎన్నికల్లోనైనా 50 శాతానికి మించని పోలింగ్