Police Custody for MLAs poaching case accused : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులను మొయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ నుంచి ముగ్గురు నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అరెస్టయిన నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజి స్వామీలను ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన అ.ని.శా. కోర్టు ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చింది.
Custody for MLAs Baiting case accused : రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులను తీసుకెళ్లిన పోలీసులు సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించనున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు వారిని తిరిగి చంచల్‌గూడ జైలుకు పంపిస్తారు.ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
నిందితులు ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని... కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గురు నిందితుల వెనక ఎవరెవరున్నారనే విషయాలను తెలుసుకోవడానికి నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. రాజకీయ కారణాలతో ముగ్గురిపైనా అక్రమ కేసులు బనాయించారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఎక్కడ కూడా డబ్బులు లభించలేదని... సుప్రీంకోర్టు సైతం బెయిల్ ఇవ్వొచ్చనే విషయాన్ని ప్రస్తావించినట్లు నిందితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.