భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదం రాజేశాయి. సోమవారం రాత్రి ఓ వీడియోను చిత్రీకరించిన రాజాసింగ్, తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇది ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. మంగళ్‌హాట్ పోలీసుస్టేషన్‌లో ఖదీర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు... ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
153-ఏ, 295-ఏ, 505 (2), 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి నేరుగా బొల్లారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజాసింగ్‌ను బొల్లారం పీఎస్ నుంచి నాంపల్లి కోర్టుకి తరలించారు. అక్కడికి రాజాసింగ్ వ్యతిరేక, అనుకూల వర్గాలు తరలిరావడంతో... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నినాదాలతో కోర్టు పరిసరాలు మారుమోగాయి. ఇరువర్గాలనూ చెదరగొట్టిన పోలీసులు.... పరిస్థితి చేయిదాటకుండా లాఠీఛార్జీ చేశారు. అదనపు బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.
విచారణ చేపట్టిన 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఆ తర్వాత రాజాసింగ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అటు... పెద్దఎత్తున విమర్శలు రావడంతో... ఎమ్మెల్యే రాజాసింగ్‌పై భాజపా అధిష్ఠానం చర్యలు తీసుకుంది. రాజాసింగ్ పై ఆగ్రహం వ్యక్తంచేసిన అధిష్ఠానం.... సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్ ను తక్షణమే పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించింది. వ్యాఖ్యలపై వచ్చే నెల 2లోగా వివరణ ఇవ్వాలని కోరింది. సస్పెన్షన్ ఉత్తర్వును కేంద్ర పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యకార్యదర్శి పేరిట విడుదల చేసింది.
ఇవీ చదవండి: రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన భాజపా అధిష్ఠానం
రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు అసహనం, ఆ గ్యారంటీ ఉందా అని సీజేఐ ప్రశ్న