Banjarahills Drugs Case: బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన కుటుంబాల్లోని యువతను ఆకట్టుకునే లక్ష్యంతో నిర్వాహకులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించినట్టు, హోటల్ బార్‌కు ఉన్న 24 గంటల అనుమతిని చూపుతూ వ్యవహారం నడిపించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పబ్‌లో జరిగే వ్యవహారం బయటకు పొక్కకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. పుడింగ్ అండ్ మింక్ పేరుతోనే ‘పామ్’ అనే యాప్‌ను రూపొందించారు. యాప్‌లో పేరు నమోదుకు రిజిస్ట్రేషన్ ఫీజుగా ఒక్కొక్కరి నుంచి రూ.50,000 వసూలు చేశారు. ‘పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఎప్పుడైనా పబ్‌కు రావచ్చు. ఇష్టమైనంత సమయం ఉండొచ్చు. ఆనందాలను ఆస్వాదించవచ్చంటూ పబ్ నిర్వాహకులు యాప్‌లోని సభ్యులను ఆహ్వానించేవారు. పోలీసులు పబ్‌వైపు కన్నెత్తి చూడరంటూ భరోసానిచ్చేవారు. అలా ఆకర్షించే క్రమంలోనే మాదకద్రవ్యాలనూ వినియోగదారులకు రుచిచూపినట్టు’ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. యాప్‌లో 250 మంది సభ్యులున్నట్టు నిర్ధారణకు వచ్చిన దర్యాప్తు అధికారులు.. ఆదివారం తెల్లవారుజామున పబ్‌లో అదుపులోకి తీసుకున్న 148 మందిలో ఎవరెవరు ఈ యాప్‌లో పేర్లను నమోదు చేసుకున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు.
30-40 మంది కొకైన్ తీసుకున్నారా? : వాస్తవంగా 45 గ్రాములకు పైగా కొకైన్ పబ్‌లోకి వచ్చినట్టు, దాడులు జరిగే సమయానికి 40 గ్రాములు ఉపయోగించినట్టు ఆధారాలను సేకరించిన దర్యాప్తు అధికారులు యాప్‌లోని సభ్యుల్లో 30-40 మంది వరకూ పార్టీ జరిగిన రోజు కొకైన్ తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మరోవైపు పబ్ భాగస్వామి అభిషేక్ ఫోన్‌లోని సుమారు 200కు పైగా అనుమానిత ఫోన్ నంబర్ల వివరాలను సేకరించారు. అందులో మాదకద్రవ్యాల విక్రేతలు/కొనుగోలుదారుల నంబర్లు కూడా ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. పబ్‌లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, సిగరెట్ పీకలు వంటి వాటిని ఇప్పటికే ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. ఒకట్రెండు రోజుల్లో ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు పామ్ యాప్‌లో, స్వాధీనం చేసుకున్న ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఉన్న అనుమానిత సమాచారాన్ని విశ్లేషించి ఎవరెవరికి నోటీసులివ్వాలి? ఎవరి నమూనాలు తీసుకోవాలనేది దర్యాప్తు అధికారులు నిర్ణయించనున్నారు.
విభేదాల వల్లనే పోలీసుల వరకూ?.. పబ్ నిర్వహణపై భాగస్వాముల మధ్య గొడవలున్నాయనే సమాచారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఒక ప్రజాప్రతినిధి సమక్షంలో రాజీ యత్నాలు సాగినట్టు తెలుస్తోంది. అంతర్గత గొడవల కారణంగానే ఇన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్న చీకటి వ్యవహారం పోలీసుల వరకూ చేరినట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని, కిరణ్‌రాజ్‌లను పట్టుకునేందుకు పోలీసులు 5 బృందాలను నియమించారు. రిమాండ్‌లో ఉన్న అనిల్‌కుమార్, అభిషేక్‌లను కస్టడీలోకి తీసుకోవడానికి బుధవారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
ఇదీ చదవండి: Radisson Pub Case: అభిషేక్‌కు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు గుర్తింపు