కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా కింగ్ కోఠిలోని జిల్లా ఆసుపత్రి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో సత్యాగ్రహం పేరిట నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. నిరసనకు అనుమతి లేకపోవడం వల్ల ర్యాలీగా వచ్చిన నాయకులను నారాయణగూడ పోలీసులు అడ్డుకున్నారు. నేతలు ఆసుపత్రి వైపు వెళ్లడానికి ప్రయత్నించడంతో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సహా పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. వారిని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల తీరు పట్ల సీతారాములు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సల ఫీజులను నియంత్రించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: ఉస్మానియా శిథిలావస్థకు చేరింది.. చర్యలు చేపట్టండి: బండి సంజయ్