Police Denied permission to Bandi Sanjay Padayatra: తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టదలచిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం రోజున నిర్మల్ జిల్లాలోని భైంసా నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఇటీవల పోలీసులను అనుమతి కోరారు. అయితే శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ సురేశ్ ధ్రువీకరించారు.
బండి అరెస్టుకు పోలీసుల యత్నం.. సోమవారం చేపట్టబోయే ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్ నుంచి నిర్మల్ వెళ్తున్న బండి సంజయ్‌ను జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న సంజయ్.. కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లిపోయారు. ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ కార్యకర్తలు అందోళనకు దిగారు.
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరించడంతో నిర్మల్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. రేపు భైంసాలో బండి సంజయ్ పాదయాత్రకు అనుమతివ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి పీఎస్‌కి తరలించారు. ఈ నెల 17న బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి కోరానని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అప్పుడు అనుమతి ఇస్తున్నట్లు ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఇప్పుడు పాదయాత్రకు అనుమతి నిరాకరించడం దారుణమని సోయం బాపూరావు మండిపడ్డారు.
ఈ నెల 28 నుంచి డిసెంబర్ 15 లేదా 16 వరకు పాదయాత్ర చేపట్టాలని తొలుత పార్టీ వర్గాలు నిర్ణయించాయి. బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభించి, కరీంనగర్‌లో ముగింపు సభ నిర్వహించాలని భావించారు. ఇప్పటి వరకు 4 విడతల్లో బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలో 1,178 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
ఇవీ చదవండి: