Police Case Registered Against Former MLA Shakeel : గత డిసెంబర్ నెలలో ప్రజాభవన్ సమీపంలో బారికేడ్లను ఢీకొట్టిన రహదారి ప్రమాదం ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైనా కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. షకీల్ కుమారుడు సాహిల్(Saheel) అతివేగంగా కారు డ్రైవింగ్ చేసి ప్రజాభవన్ ఎదురుగా ఉన్న బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసు నుంచి తప్పించేందుకు వేరే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్లుగా చూపించారు.
ప్రజాభవన్ కారు ఘటన - మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎలా తప్పించారంటే?
కేసు నుంచి మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్‌ను తప్పించేందుకు సీఐ దుర్గారావు ప్రయత్నించిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌కు తాఖీదులు జారీ చేశారు. సాహిల్‌ను కేసు నుంచి తప్పించాలని సీఐని మభ్యపెట్టినందుకు మాజీ ఎమ్మెల్యే షకీల్‌తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులో మొత్తం 10 మందిపైన కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Prajabhavan Road Accident Incident : ఈ సంఘటన జరిగిన తర్వాత ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. అప్పటికే దుబాయ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడు సాహిల్‌ను అక్కడకు పిలిపించుకున్నాడు. పంజాగుట్ట పోలీసులు తాజాగా షకీల్‌తో పాటు మరో ఇద్దరిపైనా లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.
అసలేం జరిగిందంటే : గత డిసెంబర్ నెల 23వ తేదీన వేకువజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహనం మితిమీరిన వేగానికి కారు(Car wreck) ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న మిగిలినవారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితులను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సాహిల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తెలిసింది. కేసు నుంచి మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్‌ను తప్పించేందుకు పోలీసు అధికారి ప్రయత్నించిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌కు తాఖీదులు జారీ చేశారు.