Chinese Manjha accidents: సంక్రాంతి పండుగ అంటే రంగురంగుల గాలిపటాలు ఎగురేస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా గడుపుతారు. అయితే గాలిపటాలకు ఉపయోగించే చైనా మాంజా వాడకం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. సింథటిక్ దారం, చైనీస్ మాంజా వాడకాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం నిషేధించింది. గాలిపటాలను ఎగురవేసేందుకు ఉపయోగించే గ్లాస్ కోటింగ్‌తో ఉన్న నైలాన్, సింథటిక్ మాంజా వల్ల... ప్రమాదాలు జరిగి చాలా మంది గాయాలపాలవుతున్నారు. దారంలో చిక్కుకుని పక్షులు సైతం విలవిలలాడి మృతి చెందుతున్నాయి.
Chinese Manjha accidents in Telangana : మాంజా దారం వల్ల తాజాగా హైదరాబాద్‌లో రెండు దుర్ఘటనలు జరిగాయి. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి... మాంజా దారం వల్ల గాయాలపాలయ్యాడు. ఫతేనగర్ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న నగేష్ గొంతుకు మాంజా దారం కోసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై రోడ్డుపై పడిపోయాడు. పోలీసులు అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బహుదూర్‌పురకు చెందిన నగేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ఘటనలో చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రఫియా సయీద్ అనే యువకుడు... మలక్‌పేటకు వెళ్తుండగా... చైనా మాంజా దారం గొంతుకు బిగుసుకుని తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా కుట్లు పడ్డాయి. అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం పడుతుందని వైద్యులు తెలిపారు. ఇటీవల నాగోల్‌లో తండ్రితో బైకుపై వెళ్తున్న బాలిక సైతం మాంజా దారం బారిన పడి తీవ్రంగా గాయపడింది. చైనా మాంజాపై నిషేధం విధించినా పలు చోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధూల్‌పేట, బేగంబజార్, ఎల్బీనగర్ జోన్ పరిధిలో అధికారులు సోదాలు నిర్వహించారు. 28 కేసులు నమోదు చేసిన పోలీసులు... దుకాణాల్లో నిల్వ చేసిన చైనా మాంజా బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతి వేళ మరో విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో గాలిపటాల కోసం బాలుడు పరుగెడుతూ బైక్ ఢీకొని ప్రాణాలొదిలాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముస్తాక్ అనే వ్యక్తి కుటుంబం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద రహదారుల వెంబడి చిన్న చిన్న వస్తువులు విక్రయిస్తుంటుంది. అతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగరవేసేందుకు రెండో కుమారుడు రోహిత్... ఇస్నాపూర్ నుంచి రహదారి వెంబడి గాలిపటాలు చూసుకుంటూ పటాన్‌చెరు నోవాపాన్ చౌరస్తా వరకు వెళ్లాడు. అక్కడ గాలిపటాన్ని చూసి రహదారిపై వస్తున్న వాహనాన్ని గమనించకుండా పరుగెత్తాడు. ఇస్నాపూర్ నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు బాలుడిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన రోహిత్‌ను ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇవీ చదవండి: