Fake Currency Printing Gang Arrested in Hyderabad : ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఆ అన్నాచెల్లెళ్లు నకిలీ నోట్లు తయారు చేసి ఓసారి జైలుకెళ్లొచ్చారు. అయినా తీరు మార్చుకోకుండా.. రెండోసారి మరింత పెద్దఎత్తున తమ దందా కొనసాగించారు. విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు, దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా వీరి ఆట కట్టించి.. కటకటాల్లోకి నెట్టారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కస్తూరి రమేశ్ బాబు, రామేశ్వరిలు అన్నాచెల్లెళ్లు. మహారాష్ట్రకు చెందిన ఈ ఇద్దరు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చారు. రామేశ్వరి నగరంలోని ఓ వైద్య కళాశాలలో చదువుకుంటుండగా.. రమేశ్ బాబు స్థానికంగా ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని బండ్లగూడజాగీర్‌లో మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. కరోనా కారణంగా షెడ్డు మూతపడటంతో డ్రైవర్ అవతారమెత్తాడు.
కుటుంబ అవసరాలకు ఆ డబ్బులు సరిపోకపోవడంతో అడ్డదారిలో సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు చెల్లితో కలిసి నకిలీ నోట్ల దందాను ఎంచుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి నోట్ల తయారీ నేర్చుకున్నాడు. ఇందుకు అవసరమైన సామగ్రిని దిల్లీ నుంచి తీసుకొచ్చి రూ.100, రూ.200, రూ.500 నోట్లు తయారు చేయడం ప్రారంభించాడు. అంతా సాఫీగా సాగుతుండగా.. గతేడాది సెప్టెంబర్‌లో పోలీసులకు చిక్కాడు. రామేశ్వరి తప్పించుకుని.. ముందస్తుగా బెయిల్ పొందింది.
అన్న జైలులోకి.. చెల్లి ఫీల్డ్‌లోకి..: రమేశ్‌బాబు జైలులో ఉండగా ఫలక్‌నుమాకు చెందిన హసన్‌బిన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కారాగారం నుంచి బయటికొచ్చాక ఇద్దరూ కలిసి మళ్లీ దందా ప్రారంభించారు. రమేశ్ బాబు తన మకాం తాండూరుకు మార్చి పెద్దఎత్తున రూ.500 నోట్ల తయారీకి తెరలేపాడు. ఇద్దరూ కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీల్లో ఏజెంట్లను నియమించుకుని మరీ నోట్లు చలామణి చేయడం ప్రారంభించాడు. ఈ కేసులో రమేశ్‌బాబును గత నెలలో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు.
అన్న అరెస్ట్ కావడంతో చెల్లి రామేశ్వరి మకాం చాంద్రాయణగుట్టకు మార్చింది. హసన్‌బిన్‌తో కలిసి రూ.లక్షల విలువైన నకిలీ నోట్ల చలామణికి ప్రయత్నాలు మొదలెట్టింది. పెద్దఎత్తున కమీషన్ ఆశచూపి ఏజెంట్లతో మళ్లీ దందా షురూ చేసింది. విషయం తెలియడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా సోమవారం నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.27 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు, ఓ ల్యాప్‌టాప్, నోట్ల తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి..
Fake Currency: యూట్యూబ్ చూసి దొంగనోట్ల తయారీ.. మరోసారి పోలీసులకు చిక్కి..