ఏపీలోని పోలవరం జలాశయంపై కొత్తగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనుల్ని మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టనుంది. పట్టిసీమ ఎత్తిపోతల ఉండగా పోలవరం ఎత్తిపోతల ఎందుకంటూ జలవనరుల శాఖ నిపుణులు అభ్యంతరం తెలపడం చర్చనీయాంశమైంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా ఈ పనుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ పరిధిలో ఈ పథకం లేదని, కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవాలని పేర్కొంటోంది. రూ.914 కోట్లతో ఈ ఎత్తిపోతలకు జలవనరుల శాఖ పాలనామోదం ఇచ్చింది. ఇందులో రూ.766.94 కోట్ల విలువైన పనులకు పోలవరం అధికారులు టెండర్లు పిలిచారు. తొలుత టెండర్లు ప్రక్రియ నిర్వహించగా అంచనా విలువ కన్నా 2.43 శాతం అధికానికి మేఘా ఇంజినీరింగ్ టెండరు దాఖలు చేసి ఎల్1గా నిలిచింది. తర్వాత రివర్స్ టెండర్ల ప్రక్రియలో ఈ పనులను -0.13 శాతానికి చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో రూ.765.94 కోట్ల విలువైన పనుల్ని మేఘాకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. పోలవరం జలాశయం నిర్మించాక అందులో డెడ్ స్టోరేజీ నీటిని రోజుకు ఒక టీఎంసీ చొప్పున జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో అవసరమైనప్పుడు ఎత్తిపోసి పశ్చిమగోదావరి, కృష్ణా మెట్ట ప్రాంతాల అవసరాలకు మళ్లించాలనేది ఈ ఎత్తిపోతల ఉద్దేశంగా ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
* ఎత్తిపోతల విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ దృష్టికి రాష్ట్ర జలవనరుల శాఖ తీసుకువెళ్లింది. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ పరిధిలో లేనందున దీన్ని తాము ఆమోదించేందుకు, తమ తరఫున అనుమతించేందుకు ఎలాంటి ఆస్కారమూ లేదని అథారిటీ పేర్కొంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాలని సూచించింది. జూన్‌లో నిర్వహించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకూ దీనిపై అథారిటీ సమాచారం ఇచ్చింది. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ కూడా రాశారు.
* టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాక పనులు చేపట్టేందుకు ఆమోదం తెలుపుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. టెండర్లు ఖరారు చేస్తూనే ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు అవసరమో తెలుపుతూ... పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఒప్పించేలా లేఖ రాయాలనీ పోలవరం అధికారులకు శ్యామలరావు సూచించారు. పోలవరం జలాశయం నిర్మాణం పూర్తయ్యాక ఈ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టలేమని, అందుకే దీనిని ఇప్పుడే నిర్మించాలని రాష్ట్రం నిర్ణయించిందని పోలవరం అధికారులు పేర్కొంటున్నారు. తర్వాత అనుమతులొచ్చినా పనులు చేసుకోవడానికి వీలుండదని అంటున్నారు. పోలవరం టన్నెళ్ల సామర్థ్యం పెంపు అంశాన్నీ అథారిటీకి తెలిపారు. ఎగువ గోదావరిలో నీరు లేనందున ఈ టన్నెళ్ల సామర్థ్యం ఎలా పెంచుతారని అథారిటీ ప్రశ్నిస్తోంది.
ఇదీ చూడండి : కశ్మీర్లో వరుస హత్యలు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష!