కరోనా వ్యాప్తి, లాక్డౌన్ వల్ల ఆలస్యమైన బ్యాంకుల మెర్జింగ్, ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈఓ మల్లికార్జున్ రావు తెలిపారు. ఇప్పటికే రెండు బ్యాంకుల బిజినెస్, సిబ్బంది ఇంటిగ్రేషన్ పూర్తయిందని.. మార్చి 31 కల్లా టెక్నికల్ ఇంటిగ్రేషన్ కూడా పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఒకే బ్యాంకుగా సేవలందిస్తామని ప్రకటించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికల్లా 8 శాతం వృద్ధిని సాధిస్తామని మల్లికార్జున్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పీఎన్‌బీకి ఉన్న 11వేల బ్రాంచీలను కొనసాగిస్తూ.. దక్షిణాది, పశ్చిమప్రాంతాల్లో నూతన శాఖల ఏర్పాటు దిశగా పనిచేస్తామని వెల్లడించారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరింత శక్తివంతమైందని తెలిపారు.