PM Modi Telangana Tour : రాష్ట్ర శాసనసభ ఎన్నిక ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) రానున్నారు. ఈనెల 7, 11 తేదీల్లో బీజేపీ నిర్వహించే బీసీ సభల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తరవాత ప్రధాని రాష్ట్రానికి రానుండటంతో భారీ ఎత్తున బహిరంగ సభలు(BJP BC Public Meeting) నిర్వహిస్తోంది. బీజేపీ బస్సు యాత్రను రద్దు చేసి.. వాటి స్థానంలో బీసీ బహిరంగ సభలను నిర్వహించనున్నామని గత నెలలోనే రాష్ట్ర నాయకత్వం నిర్వయం తీసుకుంది.
నామినేషన్ల పర్వం ముగిసిన తరవాత ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఉద్ధృతం చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారపర్వంలో పాల్గొననున్నారు. ఈ నెల 19వ తేదీ తర్వాత మరోసారి ప్రధాని తెలంగాణలో ఎన్నికల ప్రచారం(PM Modi Election Campaign)లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
PM Modi Election Campaign in Telangana : ఎన్నికల ప్రచారం కొరకు బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి మూడు హెలికాప్టర్లను సమకూర్చింది. ఒకటి పూర్తిగా బండి సంజయ్‌కి కేటాయించగా.. మరో రెండు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ముఖ్య నేతల ప్రచారానికి వినియోగించనున్నట్లు సమాచారం. జాతీయ ప్రధానకార్యదర్శి హోదాలో బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ 26 రోజులు దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తోంది.
వరుస పర్యటనలతో బిజీగా ఉన్న బీజేపీ నాయకత్వం : గత నెలలో కూడా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో జరిగిన బీజేపీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొని.. బీజేపీ శ్రేణులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి బీజేపీ బలంగా ప్రజల్లోకి వెళ్లింది. అలాగే జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ చూస్తోంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదు.. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో మాత్రమే కాస్త బలంగా ఉన్నందున పార్టీని అధికారంలో నిలపాలని కేంద్ర నాయకత్వం చూస్తోంది.