తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించినట్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ పార్లమెంటులో తెలిపారు. వాటిలో మూడు గ్రీన్‌ఫీల్డ్, మరో మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు ఉన్నట్లు చెప్పారు. లోక్‌సభలో తెరాస పక్షనేత నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల జాబితాలో నిజమాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, మహబూబ్‌నగర్ ఉన్నట్లు వెల్లడించారు.
బ్రౌన్‌ఫీల్డ్ జాబితాలో వరంగల్ జిల్లాలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, ఆదిలాబాద్ ఉన్నట్లు చెప్పారు. ఈ ఆరింటిపై సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాను నియమించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ కనెక్టివిటీ స్కీం-ఆర్‌సీఎస్‌ను అమలుచేస్తోందన్నారు. అందులో భాగంగా విమానాల నిర్వహణ కోసం తెలంగాణలో 52 మార్గాలను గుర్తించిందని మంత్రి పూరీ వెల్లడించారు. 36 మార్గాల్లో ప్రస్తుతం ఆర్‌సీఎస్ కార్యకలాపాలు మొదలైనట్లు వివరించారు.
ఇదీ చూడండి : 'ఈ నెలాఖరులోగా ఎస్సారెస్పీ రెండో దశ పనులు పూర్తి'