మహాత్ముడు గాంధీజీ తిరిగిన నేల అది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పల్లిపాడుకు చెందిన ఆశ్రమం స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ప్రధాన కేంద్రంగా ఉండేది. 1921 ఏప్రిల్ 7న గాంధీజీ స్వయంగా ఈ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమాలకు అప్పట్లో వేదికైంది. అంతేకాదు రాట్నం చప్పుళ్లు.. ఖద్దరు కళ.. గీతా పారాయణం తదితరాలతో మార్మోగింది. అంతటి చరిత్ర ఉన్న ఈ ఆశ్రమం 2021 ఏప్రిల్ 7 నాటికీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేసింది. దీని ద్వారా నాటి స్వరాజ్య పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేసినట్లయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
సర్వమత ప్రార్థనలు
పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ.. అప్పటి చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వీటిని చూసి తన్మయత్వం పొందుతారు. నేటికీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి.
డీ అడిక్షన్ కేంద్రం
ఈ ఆశ్రమం మొత్తం 18ఎకరాల స్థలంలో ఏర్పాటైంది. పక్కనే గలగల పారుతున్న పెన్నానది, పచ్చటి పైర్లు, చుట్టూ చెట్లు, చల్లటి వాతావరణంలో పల్లెపాడు ఆశ్రమం ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో డీ అడిక్షన్ కేంద్రం ఉంది. ఇక్కడ విశాలమైన రోడ్లు, పర్యాటకులకు విశ్రాంతి భవనం, ఓపెన్ ఎయిర్ స్టేడియం, గాంధీజీ డిజిటల్ మ్యూజియం, ఫుడ్ కోర్టు, గ్రంథాలయం నిర్మించారు. ఆశ్రమ ప్రవేశంలో గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణలో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆశ్రమ బాధ్యతలను రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహిస్తోంది.
పల్లెపాడు గాంధీ దేవాలయం
బడి పిల్లలు ఈ గాంధీ ఆశ్రమానికి ఎంతో ఇష్టంగా వస్తుంటారు. దీనిని పల్లెపాడు గాంధీ దేవాలయంగా పిల్లలు పిలుస్తారు. రఘుపతి రాఘవ రాజారాం అని పాడుకుంటూ పరవసిస్తారు. పుస్తకంలో గాంధీ చరిత్రను ఉపాధ్యాయుడు వినిపిస్తుంటే ఎంతో ఆసక్తిగా అభ్యసిస్తారు.
శత వసంతాల ఉత్సవాలు
కొవిడ్ కారణంగా పినాకిని ఆశ్రమ శత వసంతాల ఉత్సవాలను నామమాత్రంగా నిర్వహించారు. ఈ ఏడాదిలో గాంధీ ఆశయాలను విస్తృతం చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు ఇవే!