Medical PG seats: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు మరిన్ని పెరగనున్నాయి. ప్రస్తుతం 967 సీట్లుండగా, 2022-23 విద్యా సంవత్సరానికి మరో 247 వరకూ పెంచుకునే దిశగా వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఏయే విభాగాల్లో పీజీ సీట్లను పెంచుకునేందుకు అవకాశం ఉందో తెలియజేస్తూ వైద్య విద్య సంచాలకులు ఇటీవలే జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ)కు ప్రతిపాదనలు పంపించారు.
సూర్యాపేట వైద్య కళాశాలలో 25, సిద్దిపేటలో 80, నల్గొండలో 30, నిజామాబాద్‌లో 16, ఉస్మానియాలో 32, మహబూబ్‌నగర్‌లో 10, కాకతీయ వైద్య కళాశాలలో 10, ఆదిలాబాద్ రిమ్స్‌లో 22, గాంధీలో 22 చొప్పున సీట్లను పెంచాలని అందులో పేర్కొన్నారు. దీనికి త్వరలోనే ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు తర్వాత ఎంబీబీఎస్ సీట్లు 5,240కు, పీజీ సీట్లు 2,500కు, సూపర్ స్పెషాలిటీ సీట్లు 1000కి పెరుగుతాయని వైద్యశాఖ ఇప్పటికే వెల్లడించింది.
"దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తిలో పీజీ సీట్లు పెరగలేదు. ఒక్క తెలంగాణలోనే ఇది సాధ్యమైంది. ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యవిద్యలో క్రమం తప్పకుండా పదోన్నతులు కల్పిస్తున్నాం. దీనివల్ల అర్హులైన ఆచార్యులు, సహ ఆచార్యుల సంఖ్య పెరిగింది. దీంతో పీజీ సీట్లను పెంచుకోడానికి మార్గం సుగమమైంది. గత ఎనిమిదేళ్లలో 430 పీజీ వైద్యవిద్య సీట్లను పెంచుకోగలిగాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. అందుకే పీజీ సీట్ల పెరుగుదలకు ఎటువంటి ఆటంకాలు ఉండడం లేదని".. వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు.
2014 నాటికి తెలంగాణలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా... రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటి విడతలో మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటల్లో సర్కారు వైద్య కళాశాలలను నెలకొల్పారు. సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం వైద్య కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 2023-24లో మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2014లో ప్రభుత్వ వైద్యంలో ఉన్న 700 ఎంబీబీఎస్ సీట్లు 2021-22 నాటికి 1,649కి పెరిగాయి. 531 పీజీ సీట్ల సంఖ్య 961కి... సూపర్ స్పెషాలిటీ సీట్లు 82 నుంచి 153కు పెరిగాయి.
ప్రతిపాదిత పీజీ సీట్ల పెంపు వివరాలు:
ఇదీ చదవండి: Telangana corona Cases : తెలంగాణపై మరోసారి కరోనా పంజా