ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ నగరంలో బైక్ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. నగర పోలీసు అడిషనల్ సీపీ డీ.ఎస్.చౌహాన్, జాయింట్ సీపీ అరుణ్ జోషి, సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్, రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా, అడిషనల్ కమిషనర్ పంకజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో 191 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని... వాటికి విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలపై ముందస్తుగా అనుమతులు పొందాలన్నారు. ముఖ్యంగా సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణపై తేదీ, సమయం, రూట్లను స్పష్టంగా తెలియజేయాలని అడిషనల్ కమిషనర్ చౌహాన్ స్పష్టం చేశారు.
ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాన్ని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రతి కేంద్రంలో ఏడు టేబుళ్ల చొప్పున ఎనిమిది గదుల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని.. కౌంటింగ్ పూర్తికి దాదాపు 40 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు.
ఇదీ చూడండి : 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఇద్దరిని ఓడించాలి'