కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ హైదరాబాద్ నగరంలో కొనసాగుతోంది. ప్రతి పౌరుడు స్వీయ నిర్భంధంలో ఉండడం వల్ల గన్‌పార్క్, అసెంబ్లీ, నాంపల్లి, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.
ముషీరాబాద్‌లో..
జనతా కర్ఫ్యూ ప్రభావం వల్ల ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లను కలిపే ట్యాంక్‌బండ్ ప్రధాన రహదారిలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. అనునిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ట్యాంక్‌బండ్ రహదారి ప్రజలు లేక బోసిపోయింది.
మాదాపూర్‌లోనూ..
మరోవైపు మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్ రోడ్లు సైతం ఖాళీగా ఉన్నాయి. ప్రజలు ఎవరూ బయటికి రావడం లేదు. కాలనీలు, ప్రధాన రహదార్లపైన ఉన్న దుకాణాలనూ స్వచ్ఛందంగా మూసేశారు.
మెహదీపట్నంలో..
జనతా కర్ఫ్యూ ప్రభావం నగరంలోని మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, లంగర్‌హౌస్ ప్రాంతాల్లోనూ కనబడింది. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్, పూల మార్కెట్, మెహిదీపట్నం బస్‌డిపో, షాపింగ్ మాల్స్ స్వచ్ఛందంగా మూసివేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే, మెహిదీపట్నం బస్‌స్టాపులు జన సందోహం లేక వెలవెలబోతున్నాయి.
ఖైరతాబాద్‌లో..
జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రతి పౌరుడూ స్వీయ నిర్భంధంలో ఉండడం వల్ల ఖైరతాబాద్ కూడలి, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్‌రోడ్, సచివాలయ రోడ్డు పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. వాహనాలు లేక రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా జనాలు లేక నిర్మానుష్యంగా మారింది. పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కావడం వల్ల ప్రయాణికులు తిరిగి తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నిత్యం వేలాదిమందితో కిటకిటలాడే రైల్వే స్టేషన్ పరిసరాలల్లోని దుకాణాలన్నీ జనాలు లేక మూగబోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా వాహనాల్లో తరలిస్తున్నారు.
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? దాని అవసరం ఏంటి?