వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ఈనెల 26న అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేసీసీ) చేపట్టిన భారత్ బంద్‌లో ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ కోరారు. అన్నదాతలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ఉన్న చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా ఉద్యమం సాగుతున్నప్పటికీ కేంద్రం మొండి వైఖరి అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మద్దతు ధర గ్యారంటీ చట్టం తేవాలని కోరారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో భగత్‌సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులను ఉరితీసిన రోజైన ఈనెల 23న వారి త్యాగాలు స్మరించుకుంటూ కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల నేతలు, పద్మ, వేములపల్లి వెంకటరామయ్య, తదితరులు పాల్గొన్నారు.