భాగ్యనగరంపై దోమల దండయాత్ర సాగుతోంది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికీ కష్టాలు తప్పడం లేదు. అత్తాపూర్, బేగంబజార్, టోలిచౌకి, గోల్కొండ, షేక్‌పేట్, ఖైరతాబాద్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా ఉంది.
* అత్తాపూర్ సోమిరెడ్డినగర్‌కు చెందిన వాచ్‌మెన్ కుటుంబంలోని ఇద్దరికి కరోనా సోకింది. దీంతో ఉన్న ఒక్క గదిని వారికి ఇచ్చి మిగిలిన ముగ్గురు బయట వారం రోజులపాటు పడుకున్నారు. దోమల వల్ల ఇద్దరు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు.
* జియాగూడకు చెందిన వ్యక్తికి ఇటీవల కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. సాయంత్రం దోమలు కుడుతున్నాయని, రాత్రంతా కునుకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
* పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లో ఉండలేక ఇబ్బందులు పడ్డానని, ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రంలో చేరి ఇటీవలే కోలుకుని బయటికి వచ్చానని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వ్యక్తి వాపోయారు.
నిధులు లేక పనులు ఆగి..
ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్లలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా ఉంది. చార్మినార్, ఖైరతాబాద్ జోన్లకు ఫాగింగ్ యంత్రాలు అందించామని అదనపు సిబ్బందిని నియమించామని ఎంటమాలజీ విభాగం చెబుతోంది. గతంలో మూసీ అభివృద్ధి సంస్థ కూడా 60 మందిని ఏర్పాటు చేసి దోమల నివారణకు చర్యలు తీసుకుంది. నిధులు లేవన్న కారణంతో మూసీ సంస్థ సిబ్బందిని తొలగించింది. గుర్రపు డెక్క తొలగింపు, దోమల మందు పిచికారీ విస్మరించడంతో దోమల ఉద్ధృతి పెరిగింది.
ఫిర్యాదుల వెల్లువ
నగరవ్యాప్తంగా క్యూలెక్స్ దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. వాటి గుడ్లకు మూసీలోని గుర్రపు డెక్క అనుకూలిస్తోంది. అధికారులు దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టడం లేదు. జీహెచ్‌ఎంసీ అధికారులకు విన్నవిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్, శాలిబండ, పురానీహవేలీ, దారుల్‌షిఫా, సికింద్రాబాద్, జీడిమెట్ల, బాలానగర్ తదితర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి.
అదనపు సిబ్బందిని నియమిస్తాం
ఒకవైపు కరోనా, మరోవైపు దోమల బెడద ఉండటంతో ఉన్న సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పనులు చేయిస్తున్నాం. అదనపు సిబ్బందిని నియమిస్తాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక డ్రోన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. ఫ్లోటింగ్ ట్రాష్‌కలెక్షన్ యంత్రాలను తీసుకురానున్నాం. ఖైరతాబాద్, చార్మినార్ జోన్లపై ఎక్కువ దృష్టి సారించాం. మూసీ పరివాహక ప్రాంతాల్లోని స్థానికులు వ్యర్థాలను పారేస్తుండటంతో సమస్య మొదటికొస్తోంది. త్వరలో జోనల్ కమిషనర్లతో సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తాం.
-రాంబాబు, చీఫ్ ఎంటమాలజిస్ట్.
ఇదీ చూడండి: 'ఈటల రాజేందర్ భయపెట్టారు.. అనుమతులు లేకుండా నిర్మించారు'