హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు సగటున రోజుకు 40 పైసల నుంచి 60 పైసల మధ్య పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రతి వాహనదారుడిపై లీటరుకు సుమారు రూ.10 వరకు అదనపు భారం పడినట్లవుతోంది. జూన్ 7న నగరంలో పెట్రోల్ ధర రూ.74.59, డీజిల్ ధర రూ.68.40 ఉండగా 24న పెట్రోల్ ధర రూ.82.77, డీజిల్ రూ.78.04కు పెరిగింది.
సామాన్యుడు సతమతం..
అసలే కరోనా కష్టకాలం.. ఆపై అంతంతమాత్రంగా వచ్చే ఆదాయంతో సతమతమవుతున్న వారికి ఈ పెట్రోల్ ధరలు మరింత భారంగా మారనున్నాయి. ఆటోవాలాలు, క్యాబ్‌లు, ఇతర ప్రైవేటు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడం, పారిశుద్ధ్యం కోసం వెచ్చించే ఖర్చుకుతోడు పెట్రో ధరల భారం మరింత ఇబ్బంది పెడుతోంది. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్రోల్ బంకులు కలిపి 640 వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 25 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. ఈ లెక్కన సామాన్యుడిపై సుమారు రూ.2.2 కోట్లు, డీజిల్‌పై రూ.2.7 కోట్లు అదనపు భారం పడింది.