హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బుగా ఉన్న వాతావరణం సాయంత్రం మరింత చల్లబడి వర్షం దంచికొట్టింది. సాయంత్రం మొదలైన వాన చాలా సేపు కురిసింది. అకాల వర్షంతో కొందరు కేరింతలు కొట్టగా... మరికొందరు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
నగరంలోని పాతబస్తీ, ఫలక్నుమ, చాంద్రాయణగుట్ట, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, మల్కాజిగిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, నాగారం, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు.
స్తంబించిన ట్రాఫిక్
భారీ వర్షానికి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇంబ్బంది పడ్డారు. వర్షం నీరు రోడ్లపై చేరడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అకాల వర్షానికి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సతమతమయ్యారు. కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో వర్షం కురవడం వల్ల తడిసి మద్దయ్యారు.
నిలిచిపోయిన విద్యుత్
వరుణుడి ప్రతాపానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షానికి ముందుగానే కొన్ని చోట్ల విద్యుత్ నిలిపివేస్తే... పలు ప్రాంతాల్లో ఇతర కారణాలతో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇంబ్బంది పడ్డారు.